సాక్షిగా జగన్‌ పేరున్న విచారణ షెడ్యూల్‌ ఇవ్వండి

కోడి కత్తి దాడి కేసులో బాధితుడు, సాక్షిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో కూడిన విచారణ షెడ్యూల్‌ను తదుపరి విచారణలోపు తాజాగా దాఖలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించినట్లు నిందితుడి తరఫు న్యాయవాది   ఎ.సలీమ్‌ తెలిపారు.

Updated : 01 Feb 2023 06:01 IST

‘కోడికత్తి’ కేసులో దర్యాప్తు సంస్థకు ఎన్‌ఐఏ కోర్టు ఆదేశం
ఫిబ్రవరి 15కి విచారణ వాయిదా
వివరాలను వెల్లడించిన న్యాయవాది

ఈనాడు, అమరావతి: కోడి కత్తి దాడి కేసులో బాధితుడు, సాక్షిగా ఉన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో కూడిన విచారణ షెడ్యూల్‌ను తదుపరి విచారణలోపు తాజాగా దాఖలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టు ఆదేశించినట్లు నిందితుడి తరఫు న్యాయవాది   ఎ.సలీమ్‌ తెలిపారు. ‘మొదటి సాక్షి విచారణ అనంతరం హాజరయ్యే సాక్షుల జాబితా వివరాలను మెమో రూపంలో సమర్పించాలని గతంలో కోర్టు ఆదేశించినా దర్యాప్తు సంస్థ దాఖలు చేయలేదు. మంగళవారం నాటి విచారణకు మొదటి సాక్షిగా ఉన్న విశాఖ విమానాశ్రయం సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ దినేష్‌కుమార్‌ హాజరు కావాల్సి ఉంది. ఆయన తండ్రి చనిపోవడంతో రాలేకపోయారు. ఆ వివరాలతో ప్రాసిక్యూషన్‌ న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. దీంతో న్యాయమూర్తి ఈ కేసును ఫిబ్రవరి 15కు వాయిదా వేశారు’ అని వివరించారు. మొదటి సాక్షికి తాజాగా సమన్లు జారీ చేసిన న్యాయస్థానం... బాధితుడు/రెండో సాక్షిగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరుతో కూడిన విచారణ షెడ్యూల్‌ను కోర్టు ముందుంచాలని ప్రాసిక్యూషన్‌ను ఆదేశించిందని, ఈ విషయంలో విఫలమవడానికి వీల్లేదని స్పష్టం చేసిందన్నారు. మొదటి సాక్షి సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా పడిందన్నారు.

* 2018 అక్టోబరు 25న విశాఖ విమానాశ్రయంలో నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌పై జనపల్లి శ్రీనివాసరావు అనే వ్యక్తి కోడికత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. నాలుగేళ్ల తర్వాత ఈ కేసు    ఎన్‌ఐఏ కోర్టులో విచారణకు వచ్చింది. కేసు విచారణ వివరాలను నిందితుడి తరఫు న్యాయవాది ఎ.సలీమ్‌ మీడియాకు వివరించారు. ‘ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌, బాధితుడు/రెండో సాక్షిగా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి, మూడో సాక్షిగా ఉన్న జగన్‌ పీఏ హాజరు కావాలని న్యాయస్థానం పేర్కొంది. గతంలోనే నిందితుడికి బెయిల్‌ వచ్చింది. దీన్ని ఎన్‌ఐఏ... హైకోర్టుకు వెళ్లి రద్దు చేయించింది. తర్వాత కరోనాతో రెండేళ్లు విచారణ జరగలేదు. ప్రస్తుతం షెడ్యూల్‌ ప్రకారం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతోంది. విచారణలో జాప్యం జరుగుతోందని మేం విన్నవించగా... న్యాయమూర్తి స్పందించారు. త్వరితగతిన విచారణ చేద్దామన్నారు. ఈ కేసులో   56 మందిని సాక్షులుగా పేర్కొన్న దర్యాప్తు సంస్థ 40 మంది వాంగ్మూలం మాత్రమే నమోదు చేసింది. మిగిలిన వారివి తీసుకోలేదు. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. వాస్తవానికి ఈ కేసుపై రోజువారీ విచారణ జరగాల్సి ఉంది. ఫిబ్రవరి 15 నుంచి సీరియస్‌గా తీసుకుంటాం. 40 మంది సాక్షులను రోజువారీగా విచారిస్తే రెండు నెలల్లో ప్రక్రియ పూర్తవుతుందని ఆశిస్తున్నాం’ అని న్యాయవాది పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని