కష్టాలు కనలేరా? కరెంటు కొనలేరా?

వాతావరణ మార్పులతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినా.. విద్యుత్‌ కోతల నుంచి ప్రజలకు విముక్తి లభించడం లేదు.

Updated : 30 May 2023 06:58 IST

గ్రామాల్లో ఎడాపెడా కోతలు
రాత్రి వేళల్లో కనీసం గంటపాటు నిలిచిపోతున్న సరఫరా
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు


ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని అధిక గ్రామాల్లో. రోజూ 2, 3 గంటల పాటు విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారం రోజుల కిందటి వరకు పగలు, రాత్రి వేళల్లో నిర్దేశిత వ్యవధి లేకుండా కోతలు అమలయ్యాయి.


విజయనగరం జిల్లా గజపతినగరంలో పగటి వేళల్లో గంట పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. ఒకేసారి కాకుండా.. 2, నుంచి 4 సార్లుగా కరెంటు సరఫరాకు అంతరాయం కలుగుతోంది.


ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు చేసుకునే రైతులకు విద్యుత్‌ కోతలతో ఇబ్బందులు తప్పడంలేదు. రోజూ  ఒకటి రెండు గంటల పాటు సరఫరా నిలిచిపోతుండటంతో ప్రత్యామ్నాయంగా జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోంది.


ఈనాడు, అమరావతి: వాతావరణ మార్పులతో ఎండల నుంచి కొంత ఉపశమనం లభించినా.. విద్యుత్‌ కోతల నుంచి ప్రజలకు విముక్తి లభించడం లేదు. ఒకేసారి 2, 3 గంటల పాటు కోత విధిస్తుండటంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఏడాది సైతం ప్రభుత్వానికి ఇదే అనుభవం ఎదురైంది. ఈ దృష్ట్యా కోతల పంథాను అధికారులు మార్చారు. తక్కువ సమయం పాటు.. ఎక్కువ సార్లు కోత విధించే విధానానికి శ్రీకారం చుట్టారు. విద్యుత్‌ డిమాండ్‌ పెరిగినప్పుడు.. అందుకు అనుగుణంగా మండలాల వారీగా షెడ్యూల్‌ వేసి సరఫరా నిలిపివేస్తున్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో సాధ్యమైనంత మేరకు సరఫరా చేస్తున్న డిస్కంలు.. డిమాండ్‌ సర్దుబాటు కోసం గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోత పెడుతున్నాయి. ‘‘డిమాండ్‌ మేరకు విద్యుత్‌ అందుబాటులో లేనప్పుడు  మార్కెట్‌లో కొని సరఫరా చేయాలి. అలా కాకుంటే ఉత్పత్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు లేని కోతలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఎన్నాళ్లు ఉక్కపోత బాధలు’’ అని ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. డిమాండ్‌ మేరకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు రికార్డుల్లో లెక్కలు చూపుతున్నారు. ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ 233.81 ఎంయూలు(మిలియన్‌ యూనిట్లు)గా ఉంది. బహిరంగ మార్కెట్‌ నుంచి 42.2 ఎంయూలు కొన్న తర్వాత కూడా 0.24 ఎంయూల లోటు ఉన్నట్లు అధికారులు లెక్కలు చూపారు.

శనివారం విద్యుత్‌ డిమాండ్‌ 244.24 ఎంయూలు ఉంటే.. 0.19 ఎంయూలు లోటు విద్యుత్‌ ఉన్నట్లు డిస్కంలు లెక్కలు చూపాయి. ఈ లోటును సర్దుబాటు చేయడానికి ఏదో ఒక ప్రాంతంలో కోతలు విధించక తప్పడంలేదు. రాష్ట్రంలో డిమాండ్‌ తక్కువగా ఉన్నప్పుడు పగటి వేళల్లో ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తున్న డిస్కంలు.. రాత్రి వేళల్లో అనూహ్యంగా పెరిగే డిమాండ్‌ను నియంత్రించలేని పరిస్థితి. రాత్రి 10 గంటల తర్వాత ఏసీల వినియోగం ఎక్కువగా ఉండటమే కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఫీడర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగా డిమాండ్‌ సర్దుబాటు చేయడానికి రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. ఇలా విధించే కోతలకు అధికారులు సాంకేతిక కారణాలను సాకుగా చెబుతున్నారు. వాస్తవానికి పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్‌ పరిధిలో లోడ్‌ను అంచనా వేసి.. ఆ మేరకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్లను డిస్కంలు ఏర్పాటు చేయాలి. ఇలా చేయకపోవడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్‌పై ఒత్తిడి పెరిగి కొన్ని చోట్ల సమస్యలు తలెత్తుతున్నాయి. అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడం.. కొద్ది సేపటికి మళ్లీ సరఫరా పునరుద్ధరించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ఉపకరణాలు దెబ్బతింటున్నాయి. సరఫరా వచ్చి.. ఆగుతుండటంతో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది. లోఓల్టేజి కారణంగా కొన్ని రోజుల కిందట నాయుడుపేటలో ఓ అపార్టుమెంటులోని ఇళ్లలో ఏసీలు దెబ్బతిన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని