Margadarsi Chit Fund Case: ఉపసంహరించుకుంటారా.. డిస్మిస్‌ చేయమంటారా?

షేర్ల బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గాదిరెడ్డి యూరిరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది.

Updated : 21 Nov 2023 08:33 IST
మార్గదర్శిపై కేసులో యూరిరెడ్డికి సుప్రీంకోర్టు సూటిప్రశ్న
ఈనాడు, దిల్లీ: షేర్ల బదలాయింపు ఆరోపణలతో మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఛైర్మన్‌ రామోజీరావు, ఎండీ శైలజా కిరణ్‌పై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు దర్యాప్తును నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై గాదిరెడ్డి యూరిరెడ్డి అనే వ్యక్తి దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు డిస్మిస్‌ చేసింది. తన ఫిర్యాదును ప్రాతిపదికగా తీసుకొని సీఐడీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటిని ఎనిమిది వారాలు నిలిపివేయడంతోపాటు, ప్రతివాదులుగా ఉన్న సీఐడీకి, తనకు హైకోర్టు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ యూరిరెడ్డి దాఖలు చేసిన కేసు సోమవారం జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌, జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. విచారణ ప్రారంభమైన వెంటనే యూరిరెడ్డి తరఫు న్యాయవాది డి.శివరామిరెడ్డి వాదనలు ప్రారంభిస్తూ హైకోర్టు తమ వాదనలు వినకుండానే మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిందని, అలాగే దర్యాప్తుపై స్టే విధించడానికి సహేతుకమైన కారణాలు చెప్పలేదని పేర్కొన్నారు.
జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌ జోక్యం చేసుకుంటూ ఎన్నిరోజులు స్టే విధించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. 8 వారాలు అని ఆయన జవాబివ్వగా.. ఈ కేసు ఇంకా హైకోర్టు పరిధిలోనే ఉంది కదా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే తన వాదనలు వినకుండా ఉత్తర్వులు జారీ చేశారని న్యాయవాది ధర్మాసనం దృష్టికి తేగా.. అవి మధ్యంతర ఉత్తర్వులని న్యాయమూర్తి హృషికేష్‌ రాయ్‌ గుర్తు చేస్తూ.. తదుపరి విచారణ ఎప్పుడుందని ప్రశ్నించారు.. డిసెంబరు 6న అని న్యాయవాది తెలిపారు. మీరు ఈ పిటిషనర్‌ ఉపసంహరించుకుంటారా? లేదంటే డిస్మిస్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు రికార్డు చేయమంటారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దాంతో తాము దీన్ని ఉపసంహరించుకుంటామని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయనకు ఉపసంహరించుకునే అవకాశం ఇస్తూనే కేసును డిస్మిస్‌ చేస్తున్నట్లు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు.
ఇదివరకు హైకోర్టు ఈ వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా సీఐడీ తీరుపై సూటి ప్రశ్నలు సంధించింది. ఘటన హైదరాబాద్‌లో జరిగిందని ఫిర్యాదుదారుడే చెబుతున్నప్పుడు.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసే అర్హత ఏపీ సీఐడీకి ఎక్కడుందని ప్రశ్నించింది. దర్యాప్తు చేసే అధికారం మీకెక్కడిదని ఘాటుగా వ్యాఖ్యానించింది. షేర్ల బదిలీ విషయంలో తానే సంతకం చేశానని సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులోనే యూరిరెడ్డి పేర్కొన్నారని గుర్తుచేసింది. అలాంటప్పుడు బెదిరించి సంతకం చేయించారనే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది. కేసు నమోదు విషయంలో సీఐడీ అధికార పరిధిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని.. సీఐడీ నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నింటిని ఎనిమిది వారాలు నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని