Andhra news: ఊరు దాటితే ‘చంపేస్తారా’ సారూ!

‘ఎద్దు ఈనిందంటే.. దూడను కట్టేయమన్నట్లు’ ఉంది ఎన్నికల సంఘం తీరు.. ఇద్దరు మహిళలు బతికి ఉండగానే వారు చనిపోయారు.. ఓట్లు తొలగించాలంటూ వచ్చిన ఫాం-7 దరఖాస్తులను తెచ్చి నేరుగా వారికే ఇవ్వడంతో వాపోవడం ఆ మహిళల వంతయింది.

Updated : 24 Dec 2023 08:40 IST

‘ఎద్దు ఈనిందంటే.. దూడను కట్టేయమన్నట్లు’ ఉంది ఎన్నికల సంఘం తీరు.. ఇద్దరు మహిళలు బతికి ఉండగానే వారు చనిపోయారు.. ఓట్లు తొలగించాలంటూ వచ్చిన ఫాం-7 దరఖాస్తులను తెచ్చి నేరుగా వారికే ఇవ్వడంతో వాపోవడం ఆ మహిళల వంతయింది. బాపట్ల జిల్లా పర్చూరుకు చెందిన డి.సుబ్బరావమ్మ, తులసి తిరుమల బతుకుతెరువు కోసం చిలకలూరిపేట, అద్దంకిలో ఉంటున్నారు. వారిద్దరూ మృతి చెందారని, వారి ఓట్లు తొలగించాలంటూ వైకాపా నేత ఒకరు ఫాం-7 దరఖాస్తు చేశారు. సుబ్బరావమ్మ, తిరుమల జీవించే ఉన్నారని తెదేపా మండల అధ్యక్షుడు షంషుద్దీన్‌ ఇటీవల సంయుక్త కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని ఆయన తహసీల్దారు సంధ్యశ్రీని ఆదేశించారు. ఈ క్రమంలో బీఎల్వో నాగేశ్వరరావు శనివారం ఆ మహిళల ఇళ్లకు వెళ్లి ఓట్లు తొలగించమంటూ వచ్చిన దరఖాస్తుకు సంబంధించిన తాఖీదులు ఇచ్చారు. తాము బతికే ఉన్నామని, పనుల కోసం సమీపంలోని పట్టణాలకు వెళితే చనిపోయామనడం ఏమిటని వారు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. తమ నివాసాలకు సంబంధించిన ధ్రువపత్రాలను అందజేశారు. అధికారులు దీనిపై ఏం చర్య తీసుకుంటారో చూడాలి!

న్యూస్‌టుడే, పర్చూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని