మా అనుమతి లేకుండా ఓట్లెలా బదిలీ చేస్తారు?

‘మాకు సమాచారం ఇవ్వకుండా మా ఓట్లు ఎలా బదిలీచేస్తారు? నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని అధికారులు.. ఓట్ల తరలింపుపై శ్రద్ధ చూపడంలో మర్మమేంటి?’ అని దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితులు నిలదీశారు.

Updated : 29 Feb 2024 06:19 IST

పునరావాసంపై లేని శ్రద్ధ ఓట్ల తరలింపుపై చూపడంలో మర్మమేంటి?
అధికారులను నిలదీసిన పోలవరం నిర్వాసితులు
‘ఈనాడు- ఈటీవీ’ కథనంతో యంత్రాంగం పరుగులు

ఈనాడు- రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే- దేవీపట్నం, గోకవరం: ‘మాకు సమాచారం ఇవ్వకుండా మా ఓట్లు ఎలా బదిలీచేస్తారు? నిర్వాసితుల సమస్యలు పరిష్కరించని అధికారులు.. ఓట్ల తరలింపుపై శ్రద్ధ చూపడంలో మర్మమేంటి?’ అని దేవీపట్నం మండల పోలవరం నిర్వాసితులు నిలదీశారు. తమ అనుమతి లేకుండా ఓట్లను ఎలా తరలిస్తారంటూ జగ్గంపేట నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు, ఇతర అధికారులపై మండిపడ్డారు. ఓటర్లకు తెలియకుండా 2,400 ఓట్లు రంపచోడవరం నియోజకవర్గం నుంచి కాకినాడ జిల్లా జగ్గంపేటకు మార్చిన వైనంపై ‘ఈ అరాచకం అనంతం’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం కథనం ప్రచురితమవడంతో అధికారులు పరుగులు పెట్టారు. గోకవరం తహసీల్దార్‌ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసరావు, గోకవరం తహసీల్దార్‌ హేమకుమారి సమావేశం నిర్వహించి పలువురి నుంచి స్టేట్‌మెంట్లు నమోదుచేశారు.

దీంతో తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల నిర్వాసితులు వచ్చి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఓటు రంపచోడవరంలోనే ఉంచాలని, జగ్గంపేటకు బదిలీ చేస్తే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత అధికారులు కృష్ణునిపాలెం కాలనీకి వెళ్లి పలు కుటుంబాలతో మాట్లాడారు. అక్కడా ఓట్ల బదిలీపై స్థానికులు ప్రశ్నించారు. నిర్వాసితుడు పోలిశెట్టి శివరామకృష్ణ ‘ఈనాడు’తో మాట్లాడుతూ తొయ్యేరులోనే 100 మందికి ఇళ్లు నిర్మించాల్సి ఉందని, 70మందికి ప్యాకేజీలు రావాల్సి ఉందని తెలిపారు. తమ ఓట్లను మళ్లీ రంపచోడవరం నియోజకవర్గంలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. కృష్ణునిపాలెంలో గురువారం ఉదయం 10 గంటలకు ఈఆర్వో ప్రశాంత్‌కుమార్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహిస్తామని డిప్యూటీ తహసీల్దార్‌ రామకృష్ణ తెలిపారని చెప్పారు.

అధికార పార్టీ నేత అత్యుత్సాహం

ఓట్ల బదిలీ అక్రమాలపై అధికారులు విచారణ జరిపినప్పుడు.. అధికార పార్టీ స్థానిక నేత ఒకరు అత్యుత్సాహం ప్రదర్శించారు. కృష్ణునిపాలెంలో నివాసముంటూ, ఓట్లు బదిలీకాని 17 గ్రామాల వారిలో కొందరిని అధికారుల వద్దకు తీసుకెళ్లి.. ఓట్ల బదిలీకి అనుకూలంగా మాట్లాడించినట్లు తెలిసింది.


ఓట్ల బదిలీకి చర్యలు తీసుకుంటాం
రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌

ఈనాడు-అమరావతి: తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల ఓటర్లతో చర్చించి.. వారి ఓట్ల మార్పునకు ఉన్న అవకాశాలు పరిశీలించి, ఫాం-8 ద్వారా బదిలీకి తగిన చర్యలు తీసుకుంటామని రంపచోడవరం సబ్‌ కలెక్టర్‌, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారి ఎస్‌.ప్రశాంత్‌కుమార్‌ తెలిపారు. పోలవరం నిర్వాసితుల ఓట్లు అడ్డగోలుగా బదిలీ చేయడంపై ‘ఈ అరాచకం అనంతం’ శీర్షికన ‘ఈనాడు’లో బుధవారం ప్రచురితమైన కథనానికి సబ్‌ కలెక్టర్‌ స్పందించి, వివరణ ఇచ్చారు. దీనిపై దేవీపట్నం తహసీల్దార్‌ బీవీ చలపతిరావు సైతం స్పందించారు. తొయ్యేరు, దేవీపట్నం గ్రామాల్లోని నిర్వాసితుల్లో 2,475 మంది ఓటర్లు అక్కడ నివాసం ఉండకపోవడంతో వారి పునరావాస కాలనీలున్న జగ్గంపేట నియోజకవర్గంలోకి మార్పు చేశామని, ఇందులో అధికారులకు ఎలాంటి దురుద్దేశం లేదని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని