Bapatla: రహదారిపై యుద్ధవిమానాల ల్యాండింగ్‌

బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్‌వేపై యుద్ధ విమానాలను ల్యాండ్‌ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు.

Updated : 19 Mar 2024 07:13 IST

మేదరమెట్ల, న్యూస్‌టుడే: బాపట్ల జిల్లా మీదుగా వెళ్లే 16వ నంబరు జాతీయ రహదారిపై వైమానిక దళం విన్యాసాలు చేపట్టింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో అత్యవసర సమయాల్లో రహదారిపైనే ఉన్న రన్‌వేపై యుద్ధ విమానాలను ల్యాండ్‌ చేసే సామర్థ్యాన్ని మదింపు చేశారు. ఉదయం 11 గంటలకు నాలుగు సుఖోయ్‌-232 యుద్ధ విమానాలు కొరిశపాడు నుంచి రేణంగివరం వరకు రన్‌వేకు అయిదడుగుల ఎత్తులో ప్రయాణించాయి. హాక్‌ శ్రేణికి చెందిన రెండు యుద్ధ విమానాలు వాటిని అనుసరించాయి. 12 గంటలకు ఏఎన్‌-32 రకానికి చెందిన కార్గో విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్‌ అయింది. కొంతదూరం వెళ్లిన తరువాత మలుపు తీసుకుని మళ్లీ గాల్లోకి లేచింది. కాసేపటికి సిబ్బంది తరలింపునకు ఉపయోగించే డోర్నియర్‌ విమానాన్ని పైలట్లు సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. కార్యక్రమం విజయవంతంగా పూర్తయినట్లు వాయుసేన అధికారులు ప్రకటించారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌, జేసీ శ్రీధర్‌, అదనపు ఎస్పీ పాండురంగ విఠలేశ్వర్‌, ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు ఏవీఎం కుకుర్రి, జేపీ యాదవ్‌, విజయ్‌మీనన్‌, ఎన్‌.చైతన్యరెడ్డి, చీరాల డీఎస్పీ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. విమానాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు తరలిరాగా వారందరికీ అర్థమయ్యేలా ఎయిర్‌ఫోర్స్‌ అధికారులు లైవ్‌ కామెంట్రీ అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని