కోడ్‌ కూసే సమయంలో హడావుడి నియామకాలు

దేవాదాయ శాఖలో కాంట్రాక్టు విధానంలో ఇంజినీర్ల నియామకాల కోసం నాలుగు నెలల కిందట ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పుడు పోస్టింగు ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది.

Updated : 21 Mar 2024 06:32 IST

దేవాదాయ శాఖలో ఏఈల భర్తీకి డిసెంబరులో నోటిఫికేషన్‌
జనవరిలో రాత పరీక్ష
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే సమయంలో పోస్టింగులు
ఫలితాల ప్రకటనలో జాప్యం వెనక ఓ అమాత్యుని ఒత్తిళ్లు?

ఈనాడు, అమరావతి: దేవాదాయ శాఖలో కాంట్రాక్టు విధానంలో ఇంజినీర్ల నియామకాల కోసం నాలుగు నెలల కిందట ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి ఇప్పుడు పోస్టింగు ఆదేశాలివ్వడం వివాదాస్పదమైంది. మెరిట్‌ జాబితా ప్రకటించకుండానే హడావుడిగా పోస్టింగులు ఎలా ఇస్తారని కొందరు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. వివిధ జిల్లాల దేవాదాయశాఖ అధికారుల పరిధిలో పనిచేసేందుకు, పలు ముఖ్య ఆలయాల్లో పనుల పర్యవేక్షణకు 40 మంది ఏఈలు (సివిల్‌, ఎలక్ట్రికల్‌), 30 మంది టెక్నికల్‌ అసిస్టెంట్ల పోస్టులకు గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్‌ ఇచ్చారు. అయిదేళ్ల కాలానికి కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయడానికి నిర్ణయించారు. దరఖాస్తుల స్వీకరణ, రాత పరీక్ష, ఫలితాల ప్రకటన అంతా హైదరాబాద్‌లోని ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాకు అప్పగించారు. దాదాపు 2 వేల మందికి పైగా దరఖాస్తు చేశారు. వారికి ఈ ఏడాది జనవరి 21న రాత పరీక్ష నిర్వహించారు.

ఫలితాలు నెల రోజులు ఎందుకు ఆపారు?

పరీక్ష తర్వాత ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా కీ విడుదల చేసింది. రిజర్వేషన్‌, మెరిట్‌ జాబితాను ఫిబ్రవరిలోనే దేవాదాయ శాఖకు ఇచ్చింది. అయితే దేవాదాయశాఖ అధికారులు మాత్రం దాదాపు నెలపాటు ఈ ఫలితాలు ప్రకటించలేదు. ఎంపికైన అభ్యర్థుల హాల్‌టిక్కెట్ల నంబర్లను ఈనెల 13న ప్రకటించారు. వీరంతా 15, 16వ తేదీల్లో ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని సూచించి ఆ తేదీల్లో సర్టిఫికేట్లను పరిశీలించి నియామక ఆదేశాలిచ్చేశారు. వారికి కేటాయించిన దేవాదాయశాఖ కార్యాలయాలు, ఆలయాలను పేర్కొని విధుల్లో చేరేలా చూశారు.

అమాత్యుని ఒత్తిళ్లే కారణమా?

ఫలితాలు ప్రకటించకుండా దాదాపు నెలకుపైగా ఎందుకు జాప్యం చేశారని అభ్యర్థుల్లో చర్చ జరుగుతోంది. కేవలం హాల్‌టికెట్ల నంబర్లు ప్రకటించి ధ్రువపత్రాల పరిశీలనకు రావాలని సూచించారని, ఎవరికెన్ని మార్కులు వచ్చాయో, ఏ విధంగా ఎంపికయ్యారనేది స్పష్టం చేయలేదని చెబుతున్నారు. అయితే ఈ ఫలితాల ప్రకటన జాప్యంలో ఓ అమాత్యుడి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రచారమవుతోంది. ఈ పరీక్షలో అర్హత సాధించలేకపోయిన తమవాళ్లు కొందరికి ఎలాగైనా అవకాశం ఇవ్వాలంటూ ఆ అమాత్యుని ఓఎస్డీ ద్వారా ఒత్తిళ్లు చేసినట్లు సమాచారం. దీనివల్లే దాదాపు నెలపాటు ఫలితాల విడుదలలో దోబూచులాట జరిగిందనే వాదన వినిపిస్తోంది. చివరకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్నారని తెలిసి హడావుడిగా ఫలితాల ప్రకటన, ధ్రువపత్రాల పరిశీలన, పోస్టింగు ఆదేశాలివ్వడం యుద్ధప్రాతిపదికన చేసినట్లు తెలుస్తోంది. పోస్టులను పారదర్శకంగా భర్తీ చేశామని, ఇంజినీరింగ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన ఫలితాలు యథాతథంగా ప్రకటించి వాళ్ల వెబ్‌సైట్‌తోపాటు దేవాదాయశాఖ వెబ్‌సైట్‌లోనూ ఉంచామని దేవాదాయశాఖ అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని