సీబీఐ దృష్టంతా విశాఖలోని కంటెయినర్‌ భద్రతపైనే!

సంచలనం రేపిన ‘డ్రగ్స్‌ దిగుమతి’ కేసులో సీబీఐకి కొత్త భయం పట్టుకుంది. విశాఖ కంటెయినర్‌ టెర్మినల్‌లో సీజ్‌ చేసిన ఉంచిన సరకు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది.

Published : 24 Mar 2024 06:59 IST

డ్రగ్స్‌ కలిసిన ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ పాడవుతుందనా?
కంటెయినర్‌ను ఏమైనా చేస్తారనా?
అన్ని వాతావరణాలనూ తట్టుకునే ప్రదేశానికి తరలించాలని నిర్ణయం

ఈనాడు, విశాఖపట్నం: సంచలనం రేపిన ‘డ్రగ్స్‌ దిగుమతి’ కేసులో సీబీఐకి కొత్త భయం పట్టుకుంది. విశాఖ కంటెయినర్‌ టెర్మినల్‌లో సీజ్‌ చేసిన ఉంచిన సరకు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది. బ్రెజిల్‌ నుంచి ఆరు రకాల నిషేధిత మాదకద్రవ్యాల అవశేషాలతో ‘డ్రైడ్‌ ఈస్ట్‌’ విశాఖ పోర్టుకు దిగుమతి అయినట్లు గుర్తించిన విషయం విదితమే. రెండు రోజులు నమూనాలు సేకరించాక, న్యాయమూర్తి సమక్షంలో తిరిగి 25 వేల కిలోల బ్యాగ్‌లను కంటెయినర్‌లో ఉంచి ప్రత్యేక సీల్‌ వేశారు. ప్రస్తుతం ఇది వీసీటీపీఎల్‌ ప్రధాన గేటు కుడివైపు ఉన్న ఎగ్జామినేషన్‌ పాయింట్‌లో ఉంది. అత్యంత ఖరీదైన సరకు కావడం, మున్ముందు కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కంటెయినర్‌ భద్రతను కీలకంగా భావించారు. శుక్రవారం రాత్రి అక్కడి నుంచి తరలించాలని భావించినా సాధ్యపడలేదు. ఈ కంటెయినర్‌ను ‘ఆల్‌ వెదర్‌ ఫ్రూఫ్‌’(అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకునే) ప్రదేశంలో ఉంచేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

సరకు దిగుమతి అయిన బెర్త్‌లో ఈ సదుపాయం లేదు. డ్రైడ్‌ ఈస్ట్‌తో వచ్చిన కంటెయినర్‌ను తెరిచి నమూనాలు పరీక్షించాక... ‘వర్షం కురిసే అవకాశం ఉంది. తడిచి సరకు పాడైపోవచ్చు. సరకును కంటెయినర్‌లో ఉంచండి’ అంటూ సంధ్య ఆక్వా సంస్థ ప్రతినిధులు సీబీఐ బృందాన్ని అభ్యర్థించారు. అదే సమయంలో పోర్టు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు సంఘటన స్థలం వద్ద గుమిగూడటం వల్ల విచారణకు జాప్యమైందని సీబీఐ ప్రత్యేకంగా ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న విషయం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో కంటెయినర్‌ భద్రతపై సీబీఐ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. సీజ్‌ చేసిన కంటెయినర్‌ను ఎవరైనా ఏమైనా చేస్తారనే అనుమానమా? లేక అందులోని డ్రగ్స్‌ అవశేషాలు వాతావరణానికి దెబ్బతింటాయని భయమా? అనేది కీలకాంశంగా మారింది.

కేసులో దూకుడు పెంచి

కంటెయినర్‌లోని సరకు నమూనాల్ని సేకరించక ముందే.. విశాఖ లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా సంస్థ కార్యాలయంలో రికార్డుల్ని సీబీఐ స్వాధీనం చేసుకుంది. మరోవైపు శుక్రవారం సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌కు సంబంధించి కాకినాడ మూలపేట, వజ్రకూటంలో ఏడుగురు అధికారుల బృందం తనిఖీలు చేసింది. న్యాయమూర్తి సమక్షంలో సేకరించిన నమూనాల్ని దిల్లీలోని ల్యాబ్‌కు పంపనున్నారు. ఇప్పటికే సంధ్య ఆక్వా సంస్థపై కేసు నమోదు చేసిన సీబీఐ... వ్యక్తుల పాత్రపై, బ్రెజిల్‌ నుంచి కస్టమ్స్‌ తనిఖీలు తప్పించుకుని ఎలా నౌక కదిలిందనే దానిపై క్షుణ్నంగా ఆరా తీస్తోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, ఓ మంత్రి సలహాతో... సీబీఐ విచారణలో ఉన్న సంస్థ ప్రతినిధులు ఆఘమేఘాలపై శుక్రవారం ప్రకటన విడుదల చేశారన్న విమర్శలున్నాయి. ‘మాకు పార్టీలతో సంబంధం లేదు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అంటూ ఆ ప్రకటనలో వారు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని