Online Gaming: ఆన్‌లైన్‌ గేమింగ్‌పై పన్నుతో.. ఖజానాకు ఏటా ₹20వేల కోట్లు

Online Gaming: ఆన్‌లైన్‌ గేమింగ్‌లో గరిష్ఠ పన్నుతో ఖజానాకు ఏటా రూ.20వేల కోట్ల ఆదాయం సమకూరుతుందని కేంద్రం అంచనా వేస్తోంది.

Updated : 13 Jul 2023 17:58 IST

దిల్లీ: ఆన్‌లైన్‌ గేమింగ్‌ (Online Gaming)ల్లో పూర్తి పందెం విలువపై 28శాతం పన్ను విధించాలని ఇటీవల జీఎస్‌టీ (GST) మండలి తీసుకున్న నిర్ణయంపై పరిశ్రమ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నిర్ణయంతో కేంద్ర ఖజానాకు ఏటా రూ.20వేల కోట్ల మేర అదనపు ఆదాయం వస్తుందని రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా అంచనా వేశారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.

‘‘ప్రస్తుతం ఆన్‌లైన్‌ గేమింగ్‌ (Online Gaming) కంపెనీలు నైపుణ్య ఆధారిత/అదృష్టం ఆధారిత అనే వర్గీకరణను ఆసరాగా చేసుకుని కేవలం ప్లాట్‌ఫామ్‌ ఫీజులు లేదా గ్రాస్‌ గేమింగ్‌ రెవెన్యూ (GGR) మీద మాత్రమే 18శాతం జీఎస్‌టీ చెల్లిస్తున్నాయి. పూర్తి పందెం విలువను పరిగణిస్తే ఈ పన్ను కేవలం 2-3శాతం మాత్రమే ఉంటుంది. సామాన్య ప్రజలు నిత్యం వినియోగిస్తున్న ఎన్నో ఆహార ఉత్పత్తులకు చెల్లిస్తున్న 5శాతం పన్ను రేటు కంటే కూడా ఇది తక్కువ. అందుకే పూర్తి పందెం విలువపై 28శాతం పన్ను విధించాలని నిర్ణయించాం’’ అని సంజయ్‌ మల్హోత్రా తెలిపారు.

‘‘2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆన్‌లైన్‌ గేమింగ్ సంస్థలు రూ.1700 కోట్ల జీఎస్‌టీ (GST)ని చెల్లించాలి. తక్కువ పన్ను రేటు కారణంగా ఈ మొత్తం చాలా తక్కువగా ఉంది. నిజానికి పూర్తి పందెం విలువపై పన్ను విధిస్తే గనుక ఈ మొత్తం 8 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉండేది. అంటే తాజా నిర్ణయంతో ఏటా రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుంది’’ అని ఆయన వెల్లడించారు.

ఇక, దీనిపై వస్తున్న వ్యతిరేకత గురించి రెవెన్యూ కార్యదర్శి స్పందిస్తూ.. ‘‘ఈ అంశంపై ఏవైనా గేమింగ్‌ కంపెనీలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తే.. ప్రభుత్వం పోరాడేందుకు సిద్ధంగా ఉంది. తీర్పులను సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తాం. అందువల్ల అధిక పన్ను రేటుపై మా నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుపై ఆధారపడి ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌కు గరిష్ఠ జీఎస్‌టీ రేటును విధించడాన్ని ఆల్‌ ఇండియా గేమింగ్‌ ఫెడరేషన్‌ వ్యతిరేకించింది. వ్యాపార విస్తరణ పైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు