Moonlighting: మూన్‌లైటింగ్ చేసిన ఉద్యోగుల్ని మేమూ తొలగించాం: హ్యాపియెస్ట్‌ మైండ్స్‌

Moonlighting: మూన్‌లైటింగ్‌పై చర్చ జరుగుతున్న సమయంలో హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ కీలక విషయం తెలిపింది. తమ సంస్థలోనూ రెండు ఉద్యోగాలు చేస్తున్నవారిని తొలగించామని తెలిపింది. 

Published : 23 Oct 2022 15:13 IST

దిల్లీ: మూన్‌లైటింగ్ (Moonlighting) ఆమోదయోగ్యం కాదని ప్రముఖ ఐటీ సంస్థ హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ టెక్నాలజీస్‌ (Happiest Minds Technologies) తెలిపింది. ఒక సంస్థకు సేవలందిస్తూనే మరో కంపెనీకి కూడా పని చేయడం ఉద్యోగ ఒప్పందాన్ని ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది. గత 6-12 నెలల కాలంలో తమ కంపెనీలో మూన్‌లైటింగ్‌ (Moonlighting)కు పాల్పడిన కొంతమంది ఉద్యోగుల్ని సంస్థ నుంచి తొలగించామని తెలిపింది. అయితే, అలా చేసే వారి సంఖ్య చాలా తక్కువే ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎంతమంది ఉద్యోగుల్ని తొలగించారనే విషయాన్ని మాత్రం బహిర్గతం చేయలేదు.

‘‘మూన్‌లైటింగ్‌ (Moonlighting)ను అనుమతించబోమని మేం మా ఉద్యోగులకు స్పష్టం చేస్తూ వచ్చాం. ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారంటే.. మీరు దానికి మాత్రమే పనిచేస్తామని అంగీకరించడమే. మా దాంట్లోనూ అలాంటి వారు కొంతమంది ఉంటే వెంటనే తొలగించాం. తద్వారా కంపెనీ మొత్తానికి ఓ సందేశం పంపాం. కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తున్నా సరే. అంగీకరించేది లేదు. సంబంధంలేని రంగంలో, ఉదాహరణకు వారాంతాల్లో ఏదైనా స్కూల్‌కు వెళ్లి బోధించడం వంటి స్వచ్ఛంద సేవలైతే ఫరవాలేదు. కానీ, మిగిలిన సమయంలో మాత్రం ఉద్యోగులు తమ పూర్తి సమయాన్ని హ్యాపియెస్ట్‌ మైండ్స్‌కే కేటాయించాల్సి ఉంటుంది’’ అని హ్యాపియెస్ట్‌ మైండ్స్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ అనంతరాజు అన్నారు.

మూన్‌లైటింగ్‌ ఇంకా తమ కంపెనీలో పెద్దగా విస్తరించలేదని అనంతరాజు తెలిపారు. ఈ సమస్యను నివారించడం కోసమే తమ ఉద్యోగుల్ని ఆఫీసులకు రావాలని ఆదేశించామని పేర్కొన్నారు. ఫలితంగా ఇతర కంపెనీలకూ పనిచేసే సమయం లభించదని తెలిపారు. మూన్‌లైటింగ్‌పై ఐటీ పరిశ్రమలో ఇటీవల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. విప్రో ఛైర్మన్ రిషద్‌ ప్రేమ్‌జీ దీన్ని ఒక మోసపూరిత చర్యగా పేర్కొనడంతో అది మరింత విస్తృతమైంది. తమ కంపెనీలోనూ దాదాపు 300 మందిని తొలగించినట్లు రిషద్‌ తెలిపారు. మరోవైపు మేనేజర్ల వద్ద ముందస్తు అనుమతి తీసుకుని ‘గిగ్‌’ ఉద్యోగాలు చేసుకోవడానికి ఇన్ఫోసిస్‌ తన ఉద్యోగులకు ఇటీవల ఆమోదం తెలిపింది. అయితే రెండో ఉద్యోగం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఇన్ఫోసిస్‌కు పోటీగా ఉండరాదని, తమ క్లయింట్ల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా ఉండాలని తేల్చిచెప్పింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని