Gautam Adani: శ్రీలంక అధ్యక్షుడితో గౌతమ్‌ అదానీ భేటీ.. ప్రాజెక్ట్‌ల పురోగతిపై చర్చ

భారత పర్యటనలో ఉన్న శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘెతో అదానీ గ్రూప్‌ ఛైర్మన్ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. శ్రీలంకలో అదానీ గ్రూప్ చేపడుతున్న ప్రాజెక్టుల గురించి ఆయనతో చర్చించినట్లు గౌతమ్‌ అదానీ ట్వీట్ చేశారు. 

Published : 21 Jul 2023 11:45 IST

దిల్లీ: భారత పర్యటనలో ఉన్న శ్రీలంక (Sri Lanka) అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె (Ranil Wickremesinghe)తో అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ భేటీ అయ్యారు. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడితో సమావేశమైనట్లు గౌతమ్‌ అదానీ ట్వీట్ చేశారు. ఈ భేటీలో కొలంబో పోర్టు అభివృద్ధి పనులతోపాటు శ్రీలంకలో అదానీ గ్రూప్‌ చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల పురోగతి గురించి చర్చించినట్లు తెలిపారు. 

‘‘శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘెతో సమావేశం కావడం గొప్ప గౌరవం. ఈ భేటీలో శ్రీలంకలో అదానీ గ్రూపు చేపడుతున్న పలు ప్రాజెక్టుల గురించి చర్చించడం జరిగింది. కొలంబో పోర్టు వెస్ట్ కంటైనర్ టెర్మినల్‌ అభివృద్ధి, 500 మెగావాట్‌ విండ్ ప్రాజెక్ట్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్ట్‌ గురించి చర్చించాం’’ అని గౌతమ్‌ అదానీ ట్వీట్‌లో పేర్కొన్నారు.

కొలంబో పోర్టు వెస్ట్‌ టెర్మినల్‌ అభివృద్ధికి సంబంధించి మార్చి 2021న శ్రీలంక అధికారులు అదానీ గ్రూప్‌నకు లేఖ రాశారు. శ్రీలంక పోర్టు అథారిటీ, జాన్‌ కీల్స్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లతో కలిసి అదానీ పోర్ట్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్స్ లిమిటెడ్‌ (APSEZ) వెస్ట్‌ కంటైనర్‌ టెర్మినల్‌ (WCT) నిర్మాణాన్ని చేపట్టనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 35 ఏళ్లలో డబ్ల్యూసీటీని అభివృద్ధి చేయనున్నారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె గురువారం సాయంత్రం దిల్లీకి చేరుకున్నారు. ఆయనకు విమానాశ్రయంలో విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్‌ స్వాగతం పలికారు. శుక్రవారం విక్రమసింఘె ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. వారిద్దరి మధ్య ఆర్థిక, వాణిజ్య అంశాలపై చర్చలు జరుగుతాయని విదేశాంగశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని