అదానీతో ఉబర్‌ సీఈఓ భేటీ.. ఫ్యూచర్‌ రైడ్‌ కోసమేనా?

దేశ పర్యటనలో ఉన్న ఉబర్‌ సీఈఓ బిలియనీర్‌ గౌతమ్‌ అదానీతో భేటీ అయ్యారు. భవిష్యత్‌లో ఇద్దరూ కలసి పనిచేయడానికి వీరు భేటీ అయినట్లు తెలుస్తోంది.

Published : 24 Feb 2024 22:34 IST

దిల్లీ: ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ అదానీ (Gautam Adani)తో ఉబర్‌ సీఈఓ దారా ఖోస్రోషాహి (Dara Khosrowshahi) శనివారం భేటీ అయ్యారు. ప్రస్తుతం భారత్‌ పర్యటనలో ఉన్న ఆయన అదానీతో ముచ్చటించారు. ఇద్దరు బిజినెస్‌ లీడర్లు కలసి భారతీయ వృద్ధి గురించి చర్చించుకున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. అయితే, భవిష్యత్‌లో కలిసి పనిచేసేందుకే వీరి భేటీ జరిగినట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

‘‘భారత్‌లో ఉబర్‌ విస్తరణ కోసం దారా చేసిన కృషి, డ్రైవర్ల గౌరవాన్ని పెంచడంలో ఆయన నిబద్ధత స్ఫూర్తిదాయకం. భవిష్యత్తులో దారా, అతడి బృందంతో కలసి పనిచేయడం కోసం ఆసక్తిగా ఉన్నాం’’ అని అదానీ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఈ సమావేశానికి సంబంధించిన చిత్రాలను కూడా పంచుకున్నారు. ‘‘రుచికరమైన అల్పాహారం తింటూ అదానీతో అద్భుతమైన సంభాషణ జరిపాం. భారతదేశ అసాధారణ వృద్ధి గురించి చర్చించాం’’ అని దారా పోస్ట్‌ చేశారు. భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి, ఈవీలకు మారే విషయంలో ఉబర్‌ కట్టుబడి ఉందని తెలిపారు. భవిష్యత్‌లో కలిసి పని చేయాలనుకుంటున్నామని ఆయన కూడా పేర్కొన్నారు. ఈ భేటీ ఎక్కడ జరిగిందనే విషయం మాత్రం తెలియరాలేదు. ఫొటోలను బట్టి చూస్తే అహ్మదాబాద్‌లోని అదానీ గ్రూప్‌ ప్రధాన కార్యాలయంలో జరిగినట్లు తెలుస్తోంది. 

జీమెయిల్‌ మూసివేస్తారంటూ ప్రచారం.. గూగుల్‌ క్లారిటీ

ఈ వారం ప్రారంభంలో భారత్‌కు వచ్చిన ఉబర్‌ సీఈఓ.. ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ONDC)తో ఫిబ్రవరి 22న అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌, విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో సమావేశమయ్యారు. వ్యాపార విస్తరణ, భారత్‌తో వ్యాపార భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై  చర్చించారు. అదానీ గ్రూప్‌ రానున్న దశాబ్దంలో ఎనర్జీ విభాగంలో పెద్దఎత్తున పెట్టుబడి పెట్టబోతోంది. 10GW ఉత్పాదక సామర్థ్యంతో సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేస్తోంది. ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ స్వాపింగ్‌లో కూడా పెట్టుబడి పెడుతోంది. మరోవైపు ఉబర్‌ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన వాహనాలను ఈవీలతో భర్తీ చేయాలని చూస్తోంది. తాజాగా ఈవీ సేవల్ని దిల్లీలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు