Airox Tech IPO: ఐపీఓకి ఎయిరాక్స్‌ టెక్నాలజీస్‌ దరఖాస్తు..₹750 కోట్ల సమీకరణ లక్ష్యం!

వైద్యపరికరాల తయారీ సంస్థ ఎయిరాక్స్‌ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు సెబీకి ముసాయి పత్రాలు సమర్పించిన ఈ కంపెనీ రూ.750 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 30 Sep 2022 18:25 IST

దిల్లీ: వైద్యపరికరాల తయారీ సంస్థ ఎయిరాక్స్‌ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు శుక్రవారం సెబీకి ముసాయిదా పత్రాలు సమర్పించింది. రూ.750 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూలో పూర్తిగా ‘ఆఫర్‌ ఫర్‌ సేల్‌’ కింద విక్రయించనున్న షేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కంపెనీ ఎలాంటి తాజా షేర్లను జారీ చేయడం లేదు. ప్రమోటర్లు సంజయ్‌ భరత్‌కుమార్‌ జైశ్వల్‌ రూ.525 కోట్లు, ఆశిమా సంజయ్‌ జైశ్వల్‌ రూ.225 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. జేఎం ఫైనాన్షియల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

ఎయిరాక్స్‌ ప్రధానంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్లను తయారు చేస్తోంది. పీఎస్‌ఏ మెడికల్‌ ఆక్సిజన్‌ మార్కెట్‌లో తమ వాటా 50-55 శాతం వరకు ఉంటుందని కంపెనీ ముసాయిదా పత్రాల్లో పేర్కొంది. గాలి నుంచి నత్రజని పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడంలో పీఎస్‌ఏ ఆక్సిజన్‌ జనరేటర్లను వినియోగిస్తారు. ఇతర సంప్రదాయ పద్ధతులతో పోలిస్తే వీటి వల్ల తక్కువ ఖర్చుతో ఆక్సిజన్‌ను సరఫరా చేయొచ్చు. 2027 నాటికి మెడికల్‌ ఆక్సిజన్‌ గిరాకీలో ఏటా 7-8 శాతం వృద్ధి నమోదు కానుందని క్రిసిల్‌ చెప్పినట్లు ఎయిరాక్స్‌ పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో సగానికి పైగా ఆసుపత్రులు ఆక్సిజన్‌ను సిలిండర్ల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. 2027 నాటికి వాటి స్థానంలో పీఎస్‌ఏ పద్ధతిని ఉపయోగించే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని