Elon Musk: ప్రపంచ కుబేరుల జాబితా.. మస్క్‌ను దాటేసిన బెజోస్‌

World's Richest People: ప్రపంచ కుబేరుల జాబితాలో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ మొదటి స్థానంలో నిలిచారు.

Updated : 05 Mar 2024 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా (Tesla) అధినేత ఎలాన్‌ మస్క్ (Elon Musk) ప్రపంచ కుబేరుల జాబితా (World's Richest People)లో తొలి స్థానాన్ని కోల్పోయారు. దాన్ని అమెజాన్‌ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ (Jeff Bezos) దక్కించుకున్నారు. గత తొమ్మిది నెలలుగా సంపన్నుల జాబితాలో మస్క్‌ మొదటి స్థానంలో ఉన్నారు. బ్లూమ్‌బర్గ్‌ (Bloomberg) బిలియనీర్‌ ఇండెక్స్ తాజా నివేదిక ప్రకారం జెఫ్‌ బెజోస్‌ సంపద విలువ 200 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక, మస్క్‌ సంపద 198 బిలియన్‌ డాలర్లుగా పేర్కొంది. మూడో స్థానంలో ఫ్రెంచ్‌ వ్యాపారవేత్త బెర్నార్డ్‌ ఆర్నాల్ట్‌ (Bernard Arnault), నాలుగులో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ (Mark Zukerberg), ఐదులో బిల్‌ గేట్స్‌ (Bill Gates) ఉన్నారు. 

గతేడాది మస్క్‌.. 31 బిలియన్‌ డాలర్ల సంపదను కోల్పోగా.. అదే సమయంలో బెజోస్‌ సంపద విలువ 23 బిలియన్‌ డాలర్లు పెరిగింది. మరోవైపు టెస్లా షేర్ల విలువ 2021 తర్వాత 50 శాతం మేర తగ్గింది. షాంఘైలోని ఫ్యాక్టరీ ఆశించిన స్థాయిలో ఎగుమతులు చేయలేకపోవడంతో సోమవారం మరోసారి కంపెనీ షేర్లు నష్టాలను చవిచూశాయి. గత నెలలో టెస్లా బోర్డు డైరెక్టర్లు నిర్ణయించిన 55 బిలియన్‌ డాలర్ల భారీ వేతన ప్యాకేజీ అందుకునేందుకు మస్క్‌ అనర్హుడని డెలావేర్‌ కోర్టు ఆదేశాలిచ్చింది. ఇది ఆయన సంపద విలువ తగ్గడానికి మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 

ఎలాన్‌ మస్క్‌పై ట్విటర్‌ మాజీ ఉన్నతోద్యోగుల దావా

అమెజాన్‌లో 9 శాతం వాటా బెజోస్‌ సొంతం. గత నెలలో ఆయన 8.5 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన 50 మిలియన్‌ షేర్లను అమ్మేశారు. కరోనా సమయం నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అప్పటి నుంచి అమెజాన్‌ క్రమంగా వృద్ధిని సాధిస్తోంది. ఈ జాబితాలో భారతీయ బిలియనీర్‌ ముకేశ్‌ అంబానీ (Mukesh Ambani) 115 బిలియన్‌ డాలర్ల సంపదతో 11వ స్థానంలో, 104 బిలియన్‌ డాలర్లతో గౌతమ్‌ అదానీ (Gautam Adani) 12వ స్థానంలో ఉన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని