Anand Mahindra: ‘మీర్జాపూర్‌’ మీమ్‌కు ఆనంద్‌ మహీంద్రా రిప్లయ్‌..!

ఓ నెటిజన్‌ పెట్టిన మీమ్‌ ఆనంద్‌ మహీంద్రాను దృష్టిని ఆకర్షించింది. దానికి వెంటనే బదులిచ్చారు.

Published : 17 Aug 2022 02:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశీయ ఆటోమొబైల్‌ కంపెనీ మహీంద్రా ఎలక్ట్రిక్‌ వాహనాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ విపణుల కోసం 5 విద్యుత్‌ ఎస్‌యూవీలను తీసుస్తామని ప్రకటించింది. వీటిని ఎక్స్‌యూవీ, బీఈ బ్రాండ్ల కింద తీసుకొస్తామని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఆగస్టు 15న కంపెనీ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్‌ చేశారు. దీనిపై పలువురు స్పందించారు. అందులో ఓ నెటిజన్‌ పెట్టిన మీమ్‌ ఆనంద్‌ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. దానికి వెంటనే బదులిచ్చారు. ఇంతకీ మీమ్ వెనుక అసలు విషయమేంటంటే..?

అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా భారత్‌లో అడుగుపెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయినా ఆ కంపెనీకి పరిస్థితులు అనుకూలించడం లేదు. భారత్‌లో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పాలని ప్రభుత్వం కోరుడుతుండగా.. తొలుత భారత్‌లో కార్లు విక్రయించాకే తయారీ గురించి తర్వాత ఆలోచన చేస్తానని మస్క్‌ పేర్కొన్నారు. దీంతో టెస్లా, భారత ప్రభుత్వం మధ్య పీటముడి వీడడం లేదు. ఈ నేపథ్యాన్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించాడో ట్విటర్‌ యూజర్‌. ప్రముఖ వెబ్‌సిరీస్‌ మీర్జాపూర్‌లోని పంకజ్‌ త్రిపాఠి క్యారెక్టర్‌తో రూపొందించిన మీమ్‌ను ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ కింద పోస్ట్‌ చేశాడు. ‘టెస్లా రాకపోతే ఏం.. నేనున్నా చూసుకుంటా’ అని ఆనంద్‌ మహీంద్రా భారతీయులకు భరోసా ఇస్తున్నట్లు అర్థం వచ్చేలా ఆ మీమ్‌ను రూపొందించాడు. దీనికి ఆనంద్‌ మహీంద్రా వెంటనే నవ్వుతున్నట్లు ఉండే ఓ ఎమోజీ పోస్ట్‌చేశారు. మరో యూజర్‌ సైతం మహీంద్రా కంపెనీపై విశ్వాసం వ్యక్తంచేశాడు. ‘మాకు టెస్లా అవసరం లేదు. భారత్‌లో అంతకుమించిన కార్ల తయారీ కంపెనీలు ఉన్నాయి’ అంటూ రాసుకొచ్చాడు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని