Apple: యాపిల్‌కు భారత్‌ చాలా కీలక మార్కెట్‌: టిమ్‌ కుక్‌

Apple: భారత్‌లో చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి వస్తున్నారని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో యాపిల్‌ ఉత్పత్తుల విక్రయాలు మెరుగవుతున్నాయని వెల్లడించారు.

Updated : 03 Nov 2023 16:40 IST

న్యూయార్క్‌: భారత్‌ మార్కెట్‌ను యాపిల్‌ (Apple) చాలా కీలకంగా భావిస్తోందని యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ (Tim Cook) పునరుద్ఘాటించారు. తాము ప్రధానంగా దృష్టి సారించిన మార్కెట్లలో ఇదొకటి తెలిపారు. అతిపెద్ద మార్కెట్‌ అయిన భారత్‌లో తమ వాటా చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. తమ కంపెనీ వృద్ధికి ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో యాపిల్‌ (Apple) ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైనట్లు టిమ్‌ కుక్‌ (Tim Cook) తెలిపారు. రెండంకెల వృద్ధి నమోదైనట్లు వెల్లడించారు. భారత్‌లో చాలా మంది మధ్య తరగతి ఆదాయ వర్గంలోకి వస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో యాపిల్‌ ఉత్పత్తుల విక్రయాలు మెరుగవుతున్నాయని తెలిపారు. ముంబయి, దిల్లీలో రిటైల్‌ స్టోర్లను తెరిచిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అవి తమ అంచనాల కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. అయితే, ఆరంభంలో లభించినంత స్పందన మాత్రం లేదన్నారు. మరోవైపు చైనాలో నమోదైన వృద్ధితో భారత్‌ను పోల్చలేమని.. ప్రాంతాన్ని బట్టి పరిస్థితులు మారతాయన్నారు.

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్‌ (Apple) ఆదాయం 89.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. క్రితం ఏడాది నమోదైన 90.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఒక శాతం క్షీణత కనిపించింది. మరోవైపు భారత్‌లో 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం 48 శాతం పెరిగి రూ.49,322 కోట్లకు చేరినట్లు బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ టోఫ్లర్‌ ఇటీవల వెల్లడించింది.

మరోవైపు ఐఫోన్‌ 17 మోడల్‌ను భారత్‌లో అభివృద్ధి చేయడంతో పాటు, ఇక్కడే తయారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే సంవత్సరం రెండో అర్ధభాగంలో ఈ ఫోన్ల తయారీని ప్రారంభించేందుకు యాపిల్‌కు కాంట్రాక్టు తయారీ సంస్థలైన ఫాక్స్‌కాన్‌, పెగట్రాన్‌, టాటా గ్రూపు కొనుగోలు చేసిన విస్ట్రాన్‌ సన్నద్ధమయ్యే అవకాశం ఉందని ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌ తెలిపింది. ఇదే జరిగితే చైనా వెలుపల యాపిల్‌ కొత్త మోడల్‌ ఉత్పత్తుల తయారీ ప్రారంభం కావడం ఇదే మొదటిసారి అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు