Ather Energy: 10 లక్షల యూనిట్లతో ఏథర్‌ మూడో ప్లాంట్‌.. వచ్చే ఏడాది నుంచే

ప్రముఖ ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల సంస్థ ఏథర్‌ ఎనర్జీ మూడో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రదేశం దాదాపు ఖరారైంది. వచ్చే ఏడాది నుంచి అక్కడే ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది.

Published : 23 Nov 2022 22:26 IST

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్‌ విద్యుత్‌ వాహనాల సంస్థ ఏథర్‌ ఎనర్జీ మూడో తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి ప్రదేశం దాదాపు ఖరారైంది. వచ్చే ఏడాది నుంచి అక్కడే ఉత్పత్తి ప్రారంభించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం తమిళనాడులోని హోసూర్‌లో రెండు తయారీ ప్లాంట్లు ఆ కంపెనీకి ఉన్నాయి. వీటి ద్వారా 4.2 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుత సామర్థ్యం సరిపోకపోవడంతో కొత్త తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ స్వప్నిల్‌ జైన్‌ వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా ప్రదేశాన్ని ఖరారు చేయనున్నామని చెప్పిన ఆయన.. ఏ రాష్ట్రంలో నెలకొల్పబోతున్నారనేది మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఏథర్‌ మహారాష్ట్ర, కర్ణాటకతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 10 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యంతో నెలకొల్పే ఈ ప్లాంట్‌ అందుబాటులోకి వస్తే కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం 14 లక్షలకు చేరనుంది.

ప్రొడక్ట్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడంతో పాటు సేల్స్‌ నెట్‌వర్క్‌ను సైతం విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్వప్నిల్‌ జైన్‌ తెలిపారు. రాబోయే 2-3 ఏళ్లలో 5-10 ఉత్పత్తులు తీసుకురానున్నామని చెప్పారు. సమీప భవిష్యత్‌లో విద్యుత్‌ బైక్‌లుగానీ, త్రీవీలర్స్‌ గానీ తీసుకొచ్చే ప్రణాళిక ఏదీ లేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం 600 లోకేషన్స్‌లో ఉన్న ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను వచ్చే ఏడాది చివరికల్లా 1400కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఏథర్‌ ఎనర్జీ 450ఎక్స్‌, 450 ప్లస్‌ అనే రెండు విద్యుత్‌  స్కూటర్లను తయారు చేస్తోంది. అక్టోబర్‌ విక్రయాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఏథర్‌కు 12 -13 శాతం మార్కెట్‌ వాటా ఉంది. ఏథర్‌ ఎనర్జీలో హీరో మోటోకార్ప్‌కు 35 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు