Happy Forgings IPO: 19 నుంచి హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ.. పూర్తి వివరాలు ఇవే..!

Happy Forgings IPO: హ్యాపీ ఫోర్జింగ్స్‌ ఐపీఓ డిసెంబర్‌ 19న ప్రారంభం కానుంది. ధరల శ్రేణి రూ.808-850గా కంపెనీ నిర్ణయించింది. 

Published : 14 Dec 2023 16:19 IST

Happy Forgings IPO | దిల్లీ: ఆటోమొబైల్‌ రంగంలో విడిభాగాల తయారు చేసే హ్యాపీ ఫోర్జింగ్స్‌ లిమిటెడ్‌ ఐపీఓ (Happy Forgings IPO) డిసెంబర్‌ 19న ప్రారంభం కానుంది. రూ.1008 కోట్లు సమీకరించే ఉద్దేశంతో ఐపీఓకు (IPO) వస్తున్న ఈ కంపెనీ ఒక్కోషేరు ధరల శ్రేణిని రూ.808-850గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు ఒకరోజు ముందుగానే అంటే డిసెంబర్‌ 18నే సబ్‌స్క్రిప్షన్‌ విండో తెరుచుకోనుంది.

ఐపీఓలో భాగంగా రూ.400 కోట్లు విలువైన షేర్లను ఫ్రెష్‌గా ఇష్యూ చేయనున్నారు. 71.6 లక్షల షేర్లు ప్రమోటర్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా విక్రయించనున్నారు. ఫ్రెష్‌ ఇష్యూ ద్వారా సమకూరిన మొత్తంతో పరికరాలు, ప్లాంట్స్‌, మెషినరీ కొనుగోళ్లకు; రుణాల తిరిగి చెల్లింపులు; సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నారు. ఐపీఓలో జారీ చేస్తున్న షేర్లలో క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు 50 శాతం కేటాయించారు. 35 శాతం షేర్లు రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్లకు కేటాయించారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 ఈక్విటీ షేర్లు (లాట్‌) కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

యూపీఐతో క్రెడిట్‌ కార్డు జత చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!

లుథియానాకు చెందిన హ్యాపీ ఫోర్జింగ్స్‌ సంస్థ కమర్షియల్‌ వాహన విభాగంలో విడిభాగాలను తయారుచేస్తుంటుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా ఈ సంస్థకు కస్టమర్లు ఉన్నారు. అశోక్‌ లేల్యాండ్‌, జేసీబీ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌ఎంఎల్‌ ఇసుజు, టాటా కమిన్స్‌ వంటి పెద్ద పెద్ద సంస్థలు ఈ సంస్థకు కస్టమర్లుగా ఉన్నాయి. భారత్‌ సహా బ్రెజిల్‌, ఇటలీ, జపాన్‌, స్పెయిన్‌, స్వీడన్‌, థాయ్‌లాండ్‌, తుర్కియే, యూకే, యూఎస్‌లో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.860.05 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 39.12 శాతం పెరిగి 1196.53 కోట్లుగా నమోదైంది. నికర లాభం సైతం రూ.142.29 కోట్ల నుంచి రూ.208.70 కోట్లకు పెరిగింది. జేఎం ఫైనాన్షియల్‌, యాక్సిస్‌ క్యాపిటల్‌, ఈక్విరస్‌ క్యాపిటల్‌, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్స్‌ బుక్‌ రన్నింగ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

అదే రోజు ముఫ్తీ జీన్స్ ఐపీఓ

ముఫ్తీ జీన్స్‌ తయారీ సంస్థ క్రెడో బ్రాండ్స్‌ మార్కెటింగ్‌ లిమిటెడ్‌ ఐపీఓ కూడా 19నే ప్రారంభం కానుంది. రూ.550 కోట్ల ఐపీఓలో భాగంగా ధరల శ్రేణిని రూ.266-280గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్‌ 21న సబ్‌స్క్రిప్షన్‌ ముగియనుంది. పూర్తిగా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించనున్నారు. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు (లాట్‌) బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా 1807 టచ్‌ పాయింట్లతో పాటు 404 ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ఔట్‌లెట్లు, 71 లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్లు, 1332 బ్రాండ్‌ ఔట్‌లెట్లు ఈ కంపెనీకి ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.341.17 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం 2022-23లో 46 శాతం పెరిగి రూ.498.18 కోట్లుగా నమోదైంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు లిస్ట్‌ కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని