BMW X5: ఆధునిక ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్5 ఎస్‌యూవీ

సరికొత్త ఫీచర్లతో బీఎండబ్ల్యూ ఎక్స్‌5 (BMW X5) ఎస్‌యూవీని మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయంగా సంస్థ మార్కెట్‌ పరిధిని విస్తరించడంలో ఈ మోడల్ సాయపడుతుందని బీఎండబ్ల్యూ భావిస్తోంది.

Published : 14 Jul 2023 20:40 IST

దిల్లీ: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ(BMW) అప్‌డేటెడ్‌ వెర్షన్‌ బీఎండబ్ల్యూ ఎక్స్5 (BMW X5) ఎస్‌యూవీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారును బీఎండబ్ల్యూ చెన్నై ప్లాంట్‌లో తయారుచేశారు. పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో తీసుకొచ్చిన ఈ మోడల్‌ ఎక్స్‌-షోరూమ్‌ ప్రారంభ వేరియంట్‌ ధర ₹ 93.9 లక్షలుగా, హైఎండ్‌ వేరియంట్‌ ధర ₹ 1.07 కోట్లుగా కంపెనీ నిర్ణయించింది. 

బీఎండబ్ల్యూ ఎక్స్‌ 5లో పెట్రోల్‌/డీజిల్‌ వేరియంట్లలో 3-లీటర్ల ఇంజిన్‌లను అమర్చారు. రెండు ఇంజిన్‌లలో 8-స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్ ట్రాన్స్‌మిషన్‌ ఉంది. పెట్రోల్‌ ఇంజిన్‌ 381హెచ్‌పీ శక్తిని, 521 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజిన్‌ 286 హెచ్‌పీ శక్తిని, 650 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను విడుదల చేస్తుంది. పెట్రోల్‌ వేరియంట్ 5.4 సెకన్లలో, డీజిల్ వేరియంట్ 6.1 సెకన్లలో 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటాయని కంపెనీ తెలిపింది. రెండు ఇంజిన్‌ వేరియంట్‌లలో 48 వోల్ట్‌ ఎలక్ట్రికల్‌ మోటార్ ఉంది. ఇది 12హెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కారు మరింత వేగంగా ప్రయాణించేందుకు ఎలక్ట్రిక్‌ మోటార్‌ సాయపడుతుందని బీఎండబ్ల్యూ పేర్కొంది. 

ఈ కారులో 14.9 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తోపాటు 12.3 అంగుళాల ఇన్ట్రుమెంట్‌ క్లస్టర్‌ను ఇస్తున్నారు. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ బీఎండబ్ల్యూ ఐడ్రైవ్‌ 8 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఎక్స్‌లైన్‌ ట్రిమ్‌, ఎమ్‌ స్పోర్ట్‌ ట్రిమ్‌ వేరియంట్‌లలో ఈ కారును కొనుగోలు చేయొచ్చు. సరికొత్త ఫీచర్స్‌తో వస్తున్న బీఎండబ్ల్యూ ఎక్స్5 కంపెనీ మార్కెట్‌ పరిధిని మరింత విస్తరించేందుకు సాయపడుతుందని బీఎండబ్ల్యూ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్‌ పవా తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని