Disney India: డిస్నీ ఇండియా కొనుగోలు రేసులో అదానీ, మారన్‌!

Disney India: డిస్నీ ఇండియా వ్యాపారం విక్రయానికి సంబంధించి మరో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. అదానీ గ్రూప్‌, సన్‌టీవీతోనూ డిస్నీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది.

Published : 06 Oct 2023 19:30 IST

Disney India | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాకు చెందిన ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ వాల్ట్‌డిస్నీ (Disney India) తన భారత టెలివిజన్‌, స్ట్రీమింగ్‌ వ్యాపారాన్ని విక్రయించేందుకు వేగంగా పావులు కదుపుతోంది. భారత వ్యాపారాన్ని విక్రయించేందుకు గతంలో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో డిస్నీ చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా మరో రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. గౌతమ్‌ అదానీకి చెందిన అదానీ గ్రూప్‌ (Adani group), కళానిధి మారన్‌కు చెందిన సన్‌ టీవీ నెట్‌వర్క్‌తో (Sun tv) సైతం డిస్నీ చర్చలు జరుపుతున్నట్లు ‘బ్లూమ్‌బెర్గ్‌’ తెలిసింది.

దేశంలో అతిపెద్ద బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీల్లో ఒకటైన సన్‌టీవీ నెట్‌వర్క్‌ గనుక డిస్నీ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంస్థకు ఇది ప్లస్‌ అయ్యే అవకాశం ఉందని, అదే ఎన్డీటీవీ కొనుగోలు ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టిన అదానీ గనుక ఈ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే ఆ సంస్థ వ్యాపార విస్తరణకు దోహదపడే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే, ప్రస్తుతం ఈ చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని, డీల్‌ అప్పుడే ఓ కొలిక్కి రాకపోవచ్చని తెలిపాయి.

మార్కెట్‌లోకి ఈప్లూటో 7జీ మ్యాక్స్‌ స్కూటీ.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 201km

ఈ వార్తలపై స్పందించేందుకు డిస్నీ ఇండియా ప్రతినిధులు నిరాకరించారు. మార్కెట్‌ ఊహాగానాలకు తాము స్పందించబోమంటూ సన్‌టీవీ, అదానీ గ్రూప్‌ ప్రతినిధులు పేర్కొన్నారు. ఐపీఎల్‌ ప్రసార హక్కులను రిలయన్స్‌ దక్కించుకోవడంతో పాటు ఉచితంగా ప్రసారాలు చేయడంతో డిస్నీకి గట్టి దెబ్బతగిలింది. దీనికితోడు వార్నర్‌ బ్రదర్స్‌కు చెందిన హెచ్‌బీఓ కాంట్రాక్టును సైతం రిలయన్స్‌కు చెందిన వయాకామ్‌ 18 దక్కించుకోవడం కూడా ప్రభావం చూపింది. అప్పటి నుంచి డిస్నీ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రైబర్లు తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ వ్యాపారాన్ని పూర్తిగా విక్రయించడం లేదా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు వంటి ఆప్షన్లను డిస్నీ పరిశీలిస్తున్నట్లు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డిస్నీ ఇండియా వ్యాపార విక్రయానికి చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని