India GDP: భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాలు పెంచిన ఫిచ్‌

Fitch raises India's GDP forecast: భారత జీడీపీ వృద్ధి అంచనాలను ఫిచ్‌ రేటింగ్‌ సంస్థ సవరించింది. గతంలో 6 శాతంగా ఉన్న వృద్ధి రేటు అంచనాలను 6.3 శాతానికి పెంచింది. 

Published : 22 Jun 2023 16:49 IST

దిల్లీ: భారత జీడీపీ (GDP) వృద్ధి అంచనాలను ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఫిచ్‌ (Fitch) సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) 6 శాతం వృద్ధి  నమోదు అవుతుందని గతంలో అంచనా వేసిన ఆ సంస్థ.. తాజాగా వృద్ధి అంచనాలను 6.3 శాతానికి సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మెరుగైన వృద్ధి, స్వల్పకాలంలో వృద్ధికి అవకాశాలు మెరుగ్గా ఉండడం వంటి కారణాలతో అంచనాలను సవరిస్తున్నట్లు తెలిపింది.

2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది 9.1 శాతం వృద్ధిని భారత్‌ నమోదు చేసింది. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో భారత జీడీపీ 6.1 శాతం వృద్ధి నమోదైంది. జవవరి-మార్చి త్రైమాసికంలో అనుకున్న దానికంటే మెరుగైన వృద్ధి నమోదైందని రేటింగ్‌ ఏజెన్సీ తెలిపింది. ఇటీవలి కాలంలో ఆటో సేల్స్‌, పీఎఐ సర్వేలు, రుణాల్లో మెరుగైన వృద్ధి నమోదవుతోందని తెలిపింది. అందుకే 2023-24 ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను 0.3 శాతం మేర పెంచుతున్నట్లు ఫిచ్‌ పేర్కొంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఫిచ్‌ గతంలోనూ సవరించింది. తొలుత 6.2 శాతం మేర వృద్ధి నమోదు చేస్తుందన్న ఫిచ్‌.. తర్వాత దాన్ని 6 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న వడ్డీ రేట్లను అందుకు కారణంగా చూపింది. అదే సంస్థ ఇప్పుడు వృద్ధి అంచనాలను పెంచింది. అలాగే 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో భారత్‌ 6.5 శాతం చొప్పున వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని ఫిచ్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు