Work From Home: ప్రత్యేక ఆర్థిక మండలిలో ఏడాది వరకే ‘ఇంటి నుంచి పని’

Work From Home: ఒక ప్రత్యేక ఆర్థిక మండలి(ఎస్‌ఈజడ్‌) యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటే ‘ఇంటి నుంచి పని’ (డబ్ల్యూఎఫ్‌హెచ్‌)కి అనుమతి ఉంటుందని.. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ అవకాశం ఇవ్వొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated : 20 Jul 2022 12:03 IST

గరిష్ఠంగా 50% మంది ఉద్యోగులకే అనుమతి

వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టీకరణ

దిల్లీ: ఒక ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) యూనిట్‌లో గరిష్ఠంగా ఏడాది పాటే ‘ఇంటి నుంచి పని (Work From Home)’ (WFH)కి అనుమతి ఉంటుందని.. మొత్తం ఉద్యోగుల్లో 50 శాతం మందికి ఈ అవకాశం ఇవ్వొచ్చని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ మేరకు ‘స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్స్‌ రూల్స్‌ 2006’లో కొత్త నిబంధన 43ఏను వాణిజ్య విభాగం నోటిఫై చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రత్యేక ఆర్థిక మండళ్ల (SEZ) లో ఏకరీతిన డబ్ల్యూఎఫ్‌హెచ్‌ (Work From Home) విధానం ఉండడం కోసం పరిశ్రమ నుంచి వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తాజా నిబంధనతో ఎస్‌ఈజడ్‌ (SEZ)లోని ఒక యూనిట్‌కు చెందిన నిర్దిష్ట విభాగ ఉద్యోగులకు ఇంటి నుంచి పనిని ఇవ్వడానికి వీలు కలిగినట్లయింది. 

ఎవరికంటే: ఐటీ/ఐటీఈఎస్‌ ఎస్‌ఈజడ్‌ (SEZ) యూనిట్లలోని ఉద్యోగులు
* ప్రయాణంలో ఉండే, ఆఫ్‌సైట్‌లో పనిచేసే ఉద్యోగులు
* తాత్కాలికంగా కార్యాలయానికి రాలేని ఉద్యోగులు

ఇంత మందికే..: కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి మొత్తం ఉద్యోగుల్లో గరిష్ఠంగా 50 శాతం మందికి ఇంటి నుంచి పనిని అప్పజెప్పవచ్చు.
* ఏదైనా సరైన కారణం ఉంటే, దానిని ఎస్‌ఈజడ్‌కు చెందిన డెవలప్‌మెంట్‌ కమిషనర్‌(డీసీ) రాతపూర్వకంగా తెలిపి, 50 శాతం కంటే ఎక్కువ మందికి సైతం అనుమతి ఇవ్వవచ్చు.

ఎంత కాలం అంటే..
*
గరిష్ఠంగా ఏడాది పాటు అనుమతి ఇవ్వవచ్చు. అయితే యూనిట్ల విజ్ఞప్తి మేరకు మరో ఏడాది పాటు డీసీ దానిని పొడిగించవచ్చు.
* ఇప్పటికే ఎస్‌ఈజడ్‌ యూనిట్లకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచి పని చేస్తుంటే తాజా నోటిఫికేషన్‌ ప్రకారం అనుమతి పొందడానికి 90 రోజుల సమయాన్ని ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని