HDFC: విలీన అనుమతికి హెచ్‌డీఎఫ్‌సీ దరఖాస్తు

హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద దరఖాస్తు చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ శనివారం వెల్లడించింది.

Updated : 07 Aug 2022 03:38 IST

దిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ లిమిటెడ్‌లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం చేసేందుకు అనుమతి ఇవ్వాలని, జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) వద్ద దరఖాస్తు చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ శనివారం వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రతిపాదనలో ఇది భాగమేనని పేర్కొంది. దీనికి ఎన్‌సీఎల్‌టీ, కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తదితర చట్టబద్ధ, నియంత్రణ సంస్థల అనుమతులతో పాటు వాటాదార్లు, ఆయా కంపెనీల క్రెడిటార్ల ఆమోదం తప్పనిసరని ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో హెచ్‌డీఎఫ్‌సీ పేర్కొంది. ఈ విలీన ప్రతిపాదనకు ఇప్పటికే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ విలీన ఒప్పందాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలు ప్రకటించాయి. 40 బిలియన్‌ డాలర్లతో (సుమారు రూ.3.16 లక్షల కోట్లు) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకోబోతోంది. ఈ ప్రక్రియను 18 నెలల్లో పూర్తి చేయాలనుకుంటున్నాయి.


ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌కు మరిన్ని విమానాలు

డ్రీమ్‌లైనర్‌ను లీజుకు తీసుకున్న విస్తారా

దిల్లీ: బోయింగ్‌కు చెందిన 787-9 డ్రీమ్‌లైనర్‌ విమానాన్ని విస్తారా లీజుకు తీసుకుంది. దిల్లీ నుంచి ఫ్రాంక్‌ఫర్ట్‌, పారిస్‌కు విమానాల సంఖ్యను పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విస్తారా తొలిసారిగా లీజుకు తీసుకున్న డ్రీమ్‌లైనర్‌ విమానం ఇదే కావడం గమనార్హం. ఇప్పటికే బోయింగ్‌ నుంచి కొనుగోలు చేసిన రెండు డ్రీమ్‌లైనర్‌ విమానాలను కంపెనీ వినియోగిస్తోంది. మరో నాలుగు డ్రీమ్‌లైనర్‌ విమానాలను డెలివరీ చేయాల్సి ఉన్నా.. బోయింగ్‌ అలా చేయలేకపోవడంతో లీజుకు తీసుకోవాల్సి వచ్చింది. డెలివరీలను పునః ప్రారంభించే ముందు డ్రీమ్‌లైనర్‌ ఉత్పత్తి లైనును సరిదిద్దాలని అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌(ఎఫ్‌ఏఏ) ఆదేశించడం ఇందుకు కారణం. 2018లోనే విస్తారా ఆరు డ్రీమ్‌లైనర్లకు ఆర్డరు పెట్టింది. అయితే రెండే ఇప్పటిదాకా వచ్చాయి. రెండో విమానాన్ని అందించిన ఆగస్టు 2020 నుంచీ మిగతా వాటి కోసం విస్తారా ఎదురుచూస్తోంది. అక్టోబరు 30 నుంచి దిల్లీ-ఫ్రాంక్‌ఫర్ట్‌కు వారానికి ఆరు విమానాలను నడపనుంది. ప్రస్తుతం వారానికి మూడు మాత్రమే నడుపుతోంది. అలాగే దిల్లీ-పారిస్‌ మార్గంలో వారానికి రెండు బదులుగా అయిదు విమానాలను మొదలుపెట్టనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని