పదేళ్లలో మరింతగా ఆర్థిక కార్యకలాపాలు

డిజిటల్‌ వాణిజ్యం కోసం ఓపెన్‌ నెట్‌వర్క్‌ (ఓఎన్‌డీసీ), రికార్డ్‌ అగ్రిగేటింగ్‌ సిస్టమ్‌, జీఎస్‌టీ, ఫాస్టాగ్‌, ఇ-వే బిల్లులు వంటి చర్యల నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో మన దేశం గణనీయ ఆర్థిక కార్యకలాపాలను నమోదు చేస్తుందని ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ నందన్‌ నీలేకని మంగళవారం వెల్లడించారు.

Published : 30 Nov 2022 02:25 IST

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నందన్‌ నీలేకని

దిల్లీ: డిజిటల్‌ వాణిజ్యం కోసం ఓపెన్‌ నెట్‌వర్క్‌ (ఓఎన్‌డీసీ), రికార్డ్‌ అగ్రిగేటింగ్‌ సిస్టమ్‌, జీఎస్‌టీ, ఫాస్టాగ్‌, ఇ-వే బిల్లులు వంటి చర్యల నేపథ్యంలో వచ్చే దశాబ్దంలో మన దేశం గణనీయ ఆర్థిక కార్యకలాపాలను నమోదు చేస్తుందని ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు, ఛైర్మన్‌ నందన్‌ నీలేకని మంగళవారం వెల్లడించారు. కార్నెజీ ఇండియా.సీఆర్‌ నిర్వహించిన 7వ అంతర్జాతీయ టెక్నాలజీ సమ్మిట్‌లో పాల్గొన్న నీలేకని మాట్లాడుతూ ‘మూడు పెద్ద అంశాలు వచ్చే దశాబ్ద కాలంలో మన దేశంపై అధిక ప్రభావం చూపుతాయి. అందులో మొదటిది ఓఎన్‌డీసీ. రెండోది అకౌంట్‌ అగ్రిగేటర్‌ ఫ్రేమ్‌వర్క్‌. మరోవైపు ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్‌టీ, ఫాస్టాగ్‌, ఇ-వే బిల్లుల వంటివి లాజిస్టిక్స్‌ రంగంలో గొప్ప మార్పును ఇవి తీసుకొస్తాయి. వస్తువులు, సేవల మార్పిడి కోసం ఎలక్ట్రానిక్‌ నెట్‌వర్క్స్‌ ద్వారా ఓపెన్‌ ప్లాట్‌ఫామ్‌ను (ఓఎన్‌డీసీ) ప్రభుత్వం త్వరలోనే తీసుకురాబోతోంది. లక్షల మంది చిన్న సరఫరాదార్లు ఈ నెట్‌వర్క్‌ సాయంతో తమ వస్తువులను ఆన్‌లైన్‌లో ఎవరికైనా విక్రయించుకునే అవకాశం లభిస్తుంది. రికార్డ్‌ అగ్రిగేటింగ్‌ వ్యవస్థ దేశంలో డేటా సాధికారిత ఆర్కిటెక్చర్‌కు ఒక వ్యాపారంగా పని చేస్తుంది. ప్రత్యేక ఇన్‌స్టలేషన్‌ (కన్సెంట్‌ మేనేజర్‌) ద్వారా వివిధ ప్రొవైడర్ల నుంచి డేటాను పొంది, వివిధ ప్రయోజనాలు సాధించొచ్చు. ఉదాహరణకు ఒక చిన్న వ్యాపారం దాని కన్సెంట్‌ మేనేజర్‌ను వినియోగించి జీఎస్‌టీ వివరాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌లను సురక్షిత పద్ధతిలో తీసుకోవచ్చు. దీని ఆధారంగా ఆ సంస్థకు రుణం ఇవ్వాలా వద్దా అనేది ఆర్థిక సంస్థలు నిర్ణయం తీసుకోవచ్చు. జీఎస్‌టీ, ఫాస్టాగ్‌, ఇ-వే బిల్లులు లాజిస్టిక్స్‌ రంగంలో గొప్ప పరివర్తనకు దారి తీస్తాయి. స్టార్టప్‌ ఇన్నోవేటర్లు, లోకల్‌ డెలివరీ, ఇంటర్‌సిటీ డెలివరీ వంటివి వస్తు రవాణాలో మార్పు తీసుకొస్తాయి. 2014లో 60 కోట్ల మందికి ఆధార్‌ కార్డులు ఉండగా, ఇప్పుడు 130 కోట్ల మందికి గుర్తింపు కార్డులు జారీ చేశాం. ఈ ఆన్‌లైన్‌ ధ్రువీకరణను దేశంలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. ఇది ఒక వ్యక్తిని బయోమెట్రిక్స్‌, ఓటీపీల సాయంతో ధ్రువీకరిస్తుంద’ని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని