రూ.10,000తో మొదలై రూ.6.63 లక్షల కోట్లకు

అంకుర సంస్థలకు ఇప్పుడు ప్రాచుర్యం లభిస్తోంది. అయితే 4 దశాబ్దాల కిత్రం, ఈ పదమే తెలియని రోజుల్లో ఏడుగురు ఔత్సాహికులు ఒక ఐటీ సంస్థను స్థాపించి..దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా ఎదిగేలా తీర్చిదిద్దారు..

Updated : 15 Dec 2022 08:59 IST

ఇన్ఫీ 40 ఏళ్ల ప్రస్థానం

అంకుర సంస్థలకు ఇప్పుడు ప్రాచుర్యం లభిస్తోంది. అయితే 4 దశాబ్దాల కిత్రం, ఈ పదమే తెలియని రోజుల్లో ఏడుగురు ఔత్సాహికులు ఒక ఐటీ సంస్థను స్థాపించి.. దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా ఎదిగేలా తీర్చిదిద్దారు.. అదే 3.14 లక్షల మందికి మెరుగైన ఉపాధి కల్పిస్తూ, రూ.1.33 లక్షల కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇన్ఫోసిస్‌. ఎన్‌.ఆర్‌. నారాయణ మూర్తి తన భార్య సుధా మూర్తి నుంచి తీసుకున్న రూ.10,000 పెట్టుబడితో మొదలైన కంపెనీ ప్రస్థానం, రూ.6.63 లక్షల కోట్ల మార్కెట్‌ విలువగా మారి, మరింత జోరుగా కొనసాగుతోంది.

ఈ ప్రయాణంలో ప్రధాన మైలురాళ్లు

* 1981లో ప్యాట్నీ కంప్యూటర్‌ సిస్టమ్స్‌ నుంచి ఏడుగురు ఇంజినీర్లు బయటకు వచ్చారు. వారంతా కలిసి ఇన్ఫోసిస్‌ కన్సల్టంట్స్‌ పేరిట ఒక అంకురాన్ని పుణెలో ఏర్పాటు చేశారు. వారే.. ఎన్‌.ఆర్‌.  నారాయణ మూర్తి, నందన్‌ నీలేకని,  ఎన్‌.ఎస్‌.రాఘవన్‌, ఎస్‌.గోపాలకృష్ణన్‌. ఎస్‌.డి.శిబూలాల్‌, కె.దినేశ్‌, అశోక్‌ అరోరా.
* 1983లో బెంగళూరుకు తమ కార్యాలయాన్ని మార్చారు.
* 1987లో అమెరికాలో అంతర్జాతీయ కార్యాలయం ఏర్పాటు  
* 1993లో ఉద్యోగులకు షేర్లను ఇవ్వడం తొలిసారి ప్రవేశపెట్టింది ఈ కంపెనీయే. అదే ఏడాది బీఎస్‌ఈలో నమోదైంది.
* 1999లో 100 మిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని చేరుకుంది. నాస్‌డాక్‌లోనూ నమోదైంది.
* 2004లో బిలియన్‌ డాలర్ల వార్షిక ఆదాయాన్ని పొందింది.
* 2006లో ఉద్యోగుల సంఖ్య 50,000ను అధిగమించింది.
* 2007లో త్రైమాసిక ఆదాయమే 100 కోట్ల డాలర్లు
* 2009లో ఒక లక్ష మంది ఉద్యోగుల మార్కుకు చేరింది.
* 2014లో తొలిసారిగా వ్యవస్థాపకేతర వ్యక్తి విశాల్‌ సిక్కా సీఈఓగా నియామకం
* 2017లో సిక్కా స్థానంలో ప్రస్తుత సీఈఓ సలీల్‌ పరేఖ్‌ను నియమించారు.
* 2021 జులైలో 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను అధిగమించిన రెండో ఐటీ కంపెనీగా మారింది. (టీసీఎస్‌ తొలి కంపెనీ)

కొనుగోళ్లలో దూకుడు తక్కువే..

ఇన్ఫోసిస్‌ స్థాయికి ఎన్నో సంస్థలను కొనుగోలు చేసి ఉండాలి. అయితే ఇప్పటిదాకా 21 కొనుగోళ్లు మాత్రమే చేపట్టింది. అందులో 11 గత అయిదేళ్లలో చేసినవే. లోడ్‌స్టోన్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌ను 2012లో 345 మి. డాలర్లతో సొంతం చేసుకోవడమే ఇప్పటిదాకా అతిపెద్ద కొనుగోలు. సిబ్బంది అధిక వలసలే ప్రస్తుతం సమస్యగా ఉంది.
భవిష్యత్తులో ఈ కంపెనీ మరిన్ని మైలురాళ్లనైతే అధిగమించడం తథ్యం.


ఇన్ఫీ వ్యవస్థాపకుల ఉత్సాహం

క్యాంపస్‌లో కలియదిరుగుతూ జ్ఞాపకాల నెమరువేత

బెంగళూరు: 40 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా బెంగళూరులో ఈనెల 13, 14 తేదీల్లో కంపెనీ సంబరాలు నిర్వహించింది. ఇన్ఫీ వ్యవస్థాపకులు ఎన్‌.ఆర్‌. నారాయణమూర్తి, నందన్‌ నీలేకని,  ఎస్‌.గోపాలకృష్ణన్‌, ఎస్‌.డి. శిబూలాల్‌, కె.దినేశ్‌లు బుధవారం బెంగళూరులోని ఇన్ఫీ ప్రధాన కార్యాలయంలో కలియదిరుగుతూ ఎన్నో జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. విలువలను పాటిస్తూ, కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు నాయకత్వ స్థానంలో సరైన వ్యక్తులను నియమించడమే ఇపుడు తమపై ఉన్న పెద్ద బాధ్యత అని నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ నీలేకని పేర్కొన్నారు.


వారిద్దరికీ కృతజ్ఞతలు: నారాయణమూర్తి

‘ఇన్ఫోసిస్‌కు 2014-17 మధ్య గడ్డుకాలం నడిచింది. మళ్లీ నందన్‌ నీలేకని ముందుకొచ్చి, ప్రస్తుత సీఈఓ సలీల్‌ ఫరేఖ్‌తో కలిసి అత్యంత సమర్థంగా నడిపించా’రంటూ వారికి నారాయణమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.‘75 ఏళ్ల వయసులో నేను మళ్లీ బాధ్యతలు చేపట్టలేను. ఇతర వ్యవస్థాపకులదీ ఇదే పరిస్థితి. గట్టిపునాదులున్న ఈ సంస్థ ఎక్కువ కాలం మనగలిగేలా యువ యాజమాన్యం ప్రణాళికలు రూపొందించాల’ని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని