సంక్షిప్త వార్తలు (7)

డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సేవలు అందించే హైదరాబాద్‌ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా శ్రీనివాస్‌ కందుల నియమితులయ్యారు.

Published : 01 Apr 2023 02:34 IST

సిగ్నిటీ ఈడీగా శ్రీనివాస్‌ కందుల

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ఇంజినీరింగ్‌ సేవలు అందించే హైదరాబాద్‌ సంస్థ సిగ్నిటీ టెక్నాలజీస్‌ నూతన ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ)గా శ్రీనివాస్‌ కందుల నియమితులయ్యారు. గతంలో ఈయన క్యాప్‌జెమినీ ఇండియా ఛైర్మన్‌, సీఈఓగా; ఐగేట్‌ మానవ వనరుల అధిపతిగానూ బాధ్యతలు నిర్వహించారు. శ్రీనివాస్‌ కందులకున్న విశేష అనుభవం సిగ్నిటీ టెక్నాలజీస్‌ భవిష్యత్‌ వృద్ధికి ఎంతో తోడ్పడనుందని సంస్థ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.
* భాగ్యనగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా కేఆర్‌ఎం రావు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈయన గెయిల్‌ (సీఅండ్‌పీ)లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.


మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌తో అరబిందో ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: హెచ్‌ఐవీ (హ్యూమన్‌ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్‌)ని నిరోధించే ఔషధం కాబొటెగ్రావిర్‌ మాత్రలు, సూదిమందును అభివృద్ధి, మార్కెటింగ్‌ చేసేందుకు మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌తో అరబిందో ఫార్మా సబ్‌ లైసెన్సింగ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఫైజర్‌, గ్లాక్సోస్మిత్‌క్లైన్‌ సంయుక్త సంస్థ అయిన వివ్‌ హెల్త్‌కేర్‌, కాబొటెగ్రావిర్‌ను అభివృద్ధి చేసి, ఐక్యరాజ్య సమితి మద్దతు ఉన్న మెడిసిన్‌ పేటెంట్‌ పూల్‌కు లైసెన్సు ఇచ్చింది. తక్కువ ధరలో ఈ ఔషధాన్ని తయారు చేసే సంస్థలకు ఇక్కడ నుంచి సబ్‌ లైసెన్సు లభిస్తుంది. అరబిందో ఫార్మా ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, భారత్‌తోపాటు 90 స్వల్ప, మధ్య ఆదాయ దేశాలకు సరఫరా చేస్తుంది. అరబిందో ఫార్మా నెల్లూరు జిల్లా నాయుడుపేట, విశాఖలోని యుజియా ఫార్మా స్పెషాలిటీస్‌ కేంద్రాల్లో ఈ ఔషధాన్ని తయారు చేయనుంది.


బీడీఎల్‌కు రూ.8,161 కోట్ల ఆర్డర్లు

ఈనాడు, హైదరాబాద్‌: భూమి నుంచి ఆకాశంలోని లక్ష్యాలను ఛేదించే ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ (వెపన్‌ సిస్టం)ను భారత సైన్యానికి అందించేందుకు, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌)కు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఆర్డరు లభించింది. భారత సైన్యంలోని రెండు రెజిమెంట్లకు ఈ వ్యవస్థను బీడీఎల్‌ అందించనుంది. ఈ ఆర్డర్‌ విలువ రూ.8,161 కోట్లు. మూడేళ్లలో ఈ ఆర్డరును పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు ఎంఎల్‌హెచ్‌ హెలికాప్టర్లకు సీఎండీఎస్‌ సరఫరాకు సంబంధించిన రూ.261 కోట్ల ఆర్డరూ లభించిందని బీడీఎల్‌ తెలిపింది. ఈ కొత్త ఆర్డర్లతో సంస్థ ఆర్డర్‌ బుక్‌ మొత్తంగా రూ.24,021 కోట్లకు చేరిందని బీడీఎల్‌ సీఎండీ సిద్ధార్థ్‌ మిశ్రా పేర్కొన్నారు.


స్తబ్దుగా మౌలిక రంగం

దిల్లీ: ఫిబ్రవరిలో 8 కీలక రంగాల వృద్ధి స్తబ్దుగా నమోదైంది. 2022 ఫిబ్రవరిలో 5.9 శాతంగా మౌలిక వృద్ధి నమోదు కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇది 6 శాతంగా నమోదైంది. ముడిచమురు మినహా అన్ని రంగాలు వృద్ధిని సాధించాయి. ఈ ఏడాది జనవరిలో కీలక రంగాల వృద్ధి 8.9 శాతంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-ఫిబ్రవరిలో బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ రంగాల వృద్ధి రేటు 7.89 శాతంగా నమోదైంది. 2021-22 ఇదే కాలంలో ఈ 8 కీలక రంగాల వృద్ధి 11.1 శాతంగా ఉంది. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఈ ప్రధాన రంగాల వాటా 40.27 శాతం ఉంటుంది.


చిన్న కంపెనీలకు నేటి నుంచి కొత్త రుణ హామీ పథకం

దిల్లీ: దేశంలోని సూక్ష్మ, చిన్న స్థాయి కంపెనీలకు సవరించిన రుణ హామీ పథకం (క్రెడిట్‌ గ్యారెంటీ స్కీమ్‌) ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి రానుంది. ఇందులో రూ.1 కోటి వరకు ఇచ్చే రుణాలకు వార్షిక ఫీజును 2 శాతం నుంచి 0.37 శాతానికి తగ్గించారు. దీని వల్ల చిన్న వ్యాపారులకు మొత్తం మీద రుణ వ్యయాలు తగ్గనున్నాయి. రుణ హామీల పరిమితిని సైతం రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పెంచుతూ క్రెడిట్‌ గ్యారెంటీ ఫండ్‌ ట్రస్ట్‌ ఫర్‌ మైక్రో అండ్‌ స్మాల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (సీజీటీఎమ్‌ఎస్‌ఈ) మార్గదర్శకాలు జారీ చేసింది. రూ.10 లక్షల వరకు అవుట్‌స్టాండింగ్‌ రుణాల హామీ విషయంలో క్లెయిముల సెటిల్‌మెంట్‌కు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ మంత్రిత్వ శాఖ పేర్కొంది.


దీపావళికి ఓయో ఐపీఓ

దిల్లీ: ఓయో బ్రాండ్‌పై ఆతిథ్య సేవలను అందిస్తున్న ఒరావెల్‌ స్టేస్‌, పబ్లిక్‌ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతి కోరుతూ ముసాయిదా పత్రాలను ప్రీ-ఫిల్లింగ్‌ పద్ధతిలో శుక్రవారం సెబీకి సమర్పించిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది దీపావళి సమయంలో ఓయో తన పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ)ను తీసుకురావొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. సంప్రదాయ మార్గంలో అయితే సెబీ అనుమతి పొందిన 12 నెలల్లోగా కంపెనీలు ఐపీఓకు వస్తుంటాయి. అదే ప్రీ-ఫిల్లింగ్‌ మార్గంలో అయితే సెబీ తుది పరిశీలన అనంతరం 18 నెలల్లోగా రావొచ్చు. అదే సమయంలో సవరించిన ముసాయిదా పత్రాల(యూడీఆర్‌హెచ్‌పీ) దశ ముందు వరకు ఇష్యూ పరిమాణాన్ని 50 శాతం వరకు సవరించుకునే అవకాశం ఉంటుంది. కాగా, మార్కెట్‌ పరిస్థితులను బట్టి 400-600 మిలియన్‌ డాలర్ల (రూ.3300 - 5000 కోట్ల) మధ్య సమీకరణకు కంపెనీ ముందుకు రావొచ్చని అంచనా.


మిత్రా ఎనర్జీ నుంచి రూ.10,150 కోట్ల ఎస్‌పీవీల కొనుగోలు: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ  

దిల్లీ: జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్‌ పూర్తిస్థాయి అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ 15 స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌, 13 అనుబంధ స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్స్‌ను మిత్రా ఎనర్జీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.10,150 కోట్లని జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. ఇవి మొత్తం 1.44 గిగావాట్ల స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని వెల్లడించింది. ఈ స్పెషల్‌ పర్పస్‌ వాహనాలు ప్రధానంగా దక్షిణ, పశ్చిమ, మధ్య భారతంలో పనిచేస్తాయని కంపెనీ వివరించింది. 2024-25 నాటికి 10 గిగావాట్ల సామర్థ్యం లక్ష్యం దిశగా ముందుకు సాగడంలో ఈ కొనుగోలు దోహదం చేస్తుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని