ఐటీ హార్డ్‌వేర్‌ తయారీకి రూ.17,000 కోట్ల ప్రోత్సాహకాలు

ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించేందుకు రూ.17,000 కోట్ల బడ్జెట్‌ వ్యయంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం 2.0కి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.

Published : 18 May 2023 02:24 IST

పీఎల్‌ఐ 2.0 పథకానికి మంత్రిమండలి ఆమోదం
దిల్లీ

టీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించేందుకు రూ.17,000 కోట్ల బడ్జెట్‌ వ్యయంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం 2.0కి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. దేశీయంగా గత 8 ఏళ్లలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ స్థిరంగా 17% సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) సాధించింది. ఈ ఏడాది ఐటీ హార్డ్‌వేర్‌ పరికరాల ఉత్పత్తి కీలకమైన  105 బి.డాలర్ల (సుమారు రూ.9 లక్షల కోట్ల)ను అధిగమించనుంది. ‘ఐటీ పీఎల్‌ఐకు రూ.17,000 కోట్ల బడ్జెట్‌ వ్యయం కేటాయించాం. ఈ పథకానికి ఆరేళ్ల కాల వ్యవధిని నిర్ణయించామ’ని ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ విలేకర్లకు వెల్లడించారు. భారీగా పరికరాలు తయారు చేసే యాపిల్‌, హెచ్‌పీ, డెల్‌, ఏసర్‌, ఆసుస్‌ వంటి సంస్థలు ఈ పథకాన్ని ఆసక్తిగా పరిశీలిస్తున్నాయని పేర్కొన్నారు. 2025-26కు దేశీయంగా 300 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.25 లక్షల కోట్ల) విలువైన ఎలక్ట్రానిక్స్‌ తయారీతో పాటు, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ రూ.82 లక్షల కోట్లకు చేరాలన్న లక్ష్యానికి ఈ పథకం తోడ్పడుతుందని మంత్రి వివరించారు.

ఈ పరికరాలకు

ఐటీ హార్డ్‌వేర్‌ పీఎల్‌ఐ 2.0 పథకం ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ పీసీలు, ఆల్‌ ఇన్‌ వన్‌ పీసీలు, సర్వర్లు, అల్ట్రా-స్మాల్‌ ఫామ్‌ ఫ్యాక్టర్‌ పరికరాలకు వర్తిస్తుంది.

ప్రోత్సాహకాలు పెరుగుతాయ్‌

పీఎల్‌ఐ 2.0 పథకం కింద కంపెనీలు 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందుకోనున్నాయి. అలాగే వస్తువుల ఉత్పత్తి కోసం దేశీయంగా తయారైన విడిభాగాలను వినియోగించుకుంటే మరో 4 శాతం అదనపు ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి. పాత పీఎల్‌ఐ పథకంలో ఇది 2 శాతంగానే ఉంది.


75,000 ఉద్యోగాలు

తాజా పథకం వల్ల రూ.2,430 కోట్ల పెట్టుబడులు వస్తాయన్నది అంచనాగా మంత్రి తెలిపారు. ఇందువల్ల రూ.3.35 లక్షల కోట్ల విలువైన అదనపు ఉత్పత్తితో పాటు,  నిర్దేశించిన కాలంలో 75,000 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

* 2021 ఫిబ్రవరిలో ఐటీ హార్డ్‌వేర్‌ తయారీకి రూ.7,350 కోట్ల విలువైన తొలి పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ పీసీలు, ఆల్‌ ఇన్‌ వన్‌ పీసీలు, సర్వర్లకు వర్తింప చేశారు. ఈ విభాగంలో బడ్జెట్‌ వ్యయాలు పెంచాలని ప్రభుత్వాన్ని పరిశ్రమ వర్గాలు అభ్యర్థించిన నేపథ్యంలో తాజాగా పీఎల్‌ఐ 2.0 పథకాన్ని ప్రకటించారు.

* పీఎల్‌ఐ పథకాన్ని 2020 ఏప్రిల్‌ నుంచి ప్రారంభించారు. ప్రధానంగా మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఇది ఫలితాన్నిచ్చింది. మొబైల్‌ ఫోన్ల తయారీ/అసెంబ్లింగ్‌లో ప్రపంచంలో రెండో అతి పెద్ద ఉత్పత్తిదారుగా మన దేశం నిలిచింది. ఈ ఏడాది మార్చిలో మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు 11 బి.డాలర్ల (సుమారు రూ.90,000 కోట్ల) మైలురాయిని అధిగమించాయి. చైనాతో పాటు మరో దేశంలోనూ తయారీ చేపట్టేందుకు చూస్తున్న అంతర్జాతీయ ఎలక్ట్రానిక్స్‌ తయారీ సంస్థలు.. అందుకు మన దేశాన్ని ఎంచుకోవడం కలిసి వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని