రిలయన్స్‌, ఐసీఐసీఐ షేర్ల దూకుడు

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ మెరిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు అండగా నిలిచాయి.

Published : 06 Jun 2023 01:44 IST

సమీక్ష

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, మహీంద్రా వంటి దిగ్గజ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో వరుసగా రెండో రోజూ సెన్సెక్స్‌, నిఫ్టీ మెరిశాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాలు ఇందుకు అండగా నిలిచాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 29 పైసలు కోల్పోయి 82.68 వద్ద ముగిసింది. బ్యారెల్‌ ముడిచమురు 1.92% లాభపడి 77.59 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రుణ పరిమితి పెంపు బిల్లుపై అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సంతకం చేయడంతో ఆసియా మార్కెట్లు రాణించాయి. ఐరోపా సూచీలు మిశ్రమంగా ట్రేడయ్యాయి.

సెన్సెక్స్‌ ఉదయం 62,759.19 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. అనంతరం అదే జోరు కొనసాగించిన సూచీ.. ఇంట్రాడేలో 62,943.20 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 240.36 పాయింట్ల లాభంతో 62,787.47 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ సూచీ 18,582.80- 18,640.15 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌ 30 షేర్లలో 16 లాభపడ్డాయి. ఎం అండ్‌ ఎం 4.01%, యాక్సిస్‌ బ్యాంక్‌ 2.68%, టాటా మోటార్స్‌ 2%, ఎల్‌ అండ్‌ టీ 1.52%, టాటా స్టీల్‌ 1.25%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 1.09%, సన్‌ఫార్మా 1.04%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 0.99%, మారుతీ 0.97%, రిలయన్స్‌ 0.89% చొప్పున రాణించాయి. టెక్‌ మహీంద్రా, ఏషియన్‌ పెయింట్స్‌, నెస్లే, కోటక్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, ఐటీసీ 1.16% వరకు నష్టపోయాయి. రంగాల వారీ సూచీల్లో వాహన 1.23%, యంత్ర పరికరాలు 1.14%, పరిశ్రమలు 1.07%, యుటిలిటీస్‌ 0.91%, సేవలు 0.56% పెరిగాయి. ఐటీ, టెక్‌ పడ్డాయి. బీఎస్‌ఈలో 2160 షేర్లు లాభపడగా, 1498 స్క్రిప్‌లు నష్టపోయాయి. 182 షేర్లలో ఎటువంటి మార్పులేదు.

వచ్చే ఏడాది ఐపీఓకు బైజూస్‌ ఆకాశ్‌: ఎడ్‌టెక్‌ దిగ్గజం బైజూస్‌ తమ అనుబంధ సంస్థ ఆకాశ్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)ను వచ్చే ఏడాది మధ్యలో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. 2023-24లో ఆకాశ్‌ ఎడ్యుకేషన్‌ ఆదాయం రూ.4,000 కోట్లు, ఎబిటా రూ.900 కోట్లుగా నమోదుకావొచ్చని కంపెనీ వెల్లడించింది. ఐపీఓకు బైజూస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. 2021 ఏప్రిల్‌లో ఆకాశ్‌ ఎడ్యుకేషన్‌ను దాదాపు రూ.7,100 కోట్లకు బైజూస్‌ కొనుగోలు చేసింది.

వ్యాపార వృద్ధి కోసం ఒకటి లేదా ఎక్కువ దఫాల్లో నాన్‌ కన్వెర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.3000 కోట్ల వరకు సమీకరించనున్నట్లు ఎస్‌బీఐ కార్డ్‌ వెల్లడించింది.

ఐపీఓ ద్వారా నిధులు సమీకరించేందుకు ముసాయిదా పత్రాలు దాఖలు చేసినట్లు విన్‌సిస్‌ ఐటీ సర్వీసెస్‌ ప్రకటించింది. కంపెనీ షేర్లు ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదుకానున్నాయి.

బ్యాంకు రుణాలు తీర్చేందుకు నాన్‌ కన్వెర్టబుల్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.1050 కోట్లు సమీకరించినట్లు ఎంబసీ ఆఫీస్‌ పార్క్స్‌ రీట్‌ పేర్కొంది. త్రైమాసిక కూపన్‌ రేటు 7.77 శాతం ప్రాతిపదికన ఈ ఎన్‌సీడీలను జారీ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 20 గిగావాట్‌ ఇన్‌స్టాల్డ్‌ పవన టర్బైన్‌ సామర్థ్యం మైలురాయిని సాధించినట్లు సుజ్లాన్‌ గ్రూప్‌ ప్రకటించింది.

డీజిల్‌లో 5 శాతం ఇథనాల్‌ బ్లెండింగ్‌పై ఐఓసీ, రెండు దేశీయ ఇంజిన్‌ తయారీ సంస్థలు జోరుగా పనిచేస్తున్నట్లు ఐఓసీ డైరెక్టర్‌ (ఆర్‌ అండ్‌ డీ) ఎస్‌ఎస్‌వీ రామకుమార్‌ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు