chandrayaan 3: అంతరిక్ష వాణిజ్యంలో భారత ముద్ర

జాబిల్లిపై భారత ముద్ర పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూ.615 కోట్ల అతి తక్కువ వ్యయంతో చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతమైంది.

Updated : 24 Aug 2023 06:52 IST

ఇస్రో విజయానికి ప్రభుత్వ - ప్రైవేటు రంగ కంపెనీల చేయూత

జాబిల్లిపై భారత ముద్ర పడింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూ.615 కోట్ల అతి తక్కువ వ్యయంతో చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతమైంది. ప్రపంచంలో మరే దేశం చేరలేకపోయిన చంద్రుడి దక్షిణ ధ్రువంపై మన ల్యాండర్‌ ‘విక్రమ్‌’ ‘సాఫ్ట్‌’గా అడుగుపెట్టింది. అంతరిక్ష వాణిజ్యంలో అగ్రగామి దేశాలతో భారత్‌ సగర్వంగా పోటీ పడనుంది. అంతర్జాతీయంగా ఏరోస్పేస్‌ టెక్నాలజీలో మన కీర్తిప్రతిష్ఠలను రెపరెపలాడించిన ‘చంద్రయాన్‌-3’ విజయంలో ప్రభుత్వరంగ, ప్రైవేటు రంగ కంపెనీలూ పాలుపంచుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు అవసరమైన ఉపకరణాలు, విడిభాగాలు, శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాన్ని యథాశక్తి అందజేశాయి. అవేంటంటే..  

టాటా ఎలక్సీ: అంతరిక్ష నౌక,  ఏవియానిక్స్‌, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి
టాటా అడ్వాన్స్‌ సిస్టమ్‌: చంద్రయాన్‌-3 ల్యాండర్‌ తయారీ
ఎల్‌ అండ్‌ టీ: ఇస్రోకు లాంచ్‌ ప్యాడ్‌, మౌలిక వసతుల అందజేత
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌: ల్యాండర్‌ అభివృద్ధితో పాటు మెకానికల్‌ పరికరాల్లో సహాయం. ఎల్‌ అండ్‌ టీ భాగస్వామ్యంతో నేషనల్‌ ఏరోస్పేస్‌ ల్యాబ్‌కు కీలక విడిభాగాలు
సెంటమ్‌ ఎలక్ట్రానిక్స్‌: స్పేస్‌ అప్లికేషన్ల కోసం ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్‌ డిజైన్‌, అభివృద్ధి, తయారీ
కేరళ స్టేట్‌ ఎలక్ట్రానిక్స్‌ డెవలప్‌మెంట్‌ కార్ప్‌(కెల్ట్రాన్‌): ఎలక్ట్రానిక్‌ పవర్‌ మాడ్యూళ్లు, టెస్ట్‌- ఎవల్యూషన్‌ సిస్టమ్‌ అభివృద్ధి
వాల్‌చంద్‌ ఇండస్ట్రీస్‌: మిషన్‌ కాంపోనెంట్స్‌ తయారీ
గోద్రేజ్‌ అండ్‌ బాయ్స్‌: చంద్రయాన్‌, మంగళయాన్‌ మిషన్లకు లిక్విడ్‌ ప్రొపెల్షన్‌ ఇంజిన్లు, శాటిలై ట్‌ థ్రస్టర్స్‌, కంట్రోల్‌ మాడ్యూల్‌ కాంపోనెంట్స్‌  అందజేత
సుందరం ఫాజనర్స్‌: ఇస్రోకు దీర్ఘకాలంగా ఫాజనర్స్‌ సరఫరా
హిమ్‌సన్‌ ఇండస్ట్రియల్‌ సెరామిక్‌: 3,000 సెల్సియస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ కరగని సిరామిక్‌ విడిభాగం స్వ్కిబ్స్‌ను ఈ కంపెనీ అందించింది.
భెల్‌: చంద్రయాన్‌ 3 కోసం 100వ బ్యాటరీని సరఫరా చేసింది
పరాస్‌ డిఫెన్స్‌: స్పేస్‌క్రాఫ్ట్‌కు నావిగేషన్‌ వ్యవస్థ సరఫరా
భారత్‌ ఫోర్జ్‌: మోనోకోక్‌ హల్‌ మల్టీ రోల్‌ మైన్‌ ప్రొటెక్టెడ్‌ ఆర్మోర్డ్‌ వెహికల్‌ను రూపొందించింది
మిశ్రధాతు నిగమ్‌: ఎల్‌వీఎం3, 4కు అవసరమైన భిన్న కీలక, వ్యూహాత్మక మెటీరియల్స్‌ తయారు చేసింది. ఓమ్నిప్రెజెంట్‌ రోబో టెక్నాలజీస్‌: ప్రగ్యాన్‌ రోవర్‌కు శక్తిమంత నావిగేషన్‌ సాఫ్ట్‌వేర్‌ అందించింది
ఎంటార్‌ టెక్నాలజీస్‌: చాలా కాలం నుంచి ఇస్రోకు రాకెట్‌ ఇంజిన్లు, కోర్‌ పంప్స్‌ అందిస్తోంది. చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు వికాస్‌ ఇంజిన్లు, క్రయోజనిక్‌ ఇంజిన్‌ సబ్‌ సిస్టమ్స్‌ (టర్బో పంప్‌, బూస్టర్‌ పంప్‌, గ్యాస్‌ జనరేటర్‌, ఇంజక్టర్‌ హెడ్‌), లాంచ్‌ వెహికల్‌ కోసం ఎలక్ట్రో- న్యూమాటిక్‌ మాడ్యూల్స్‌ సరఫరా చేసింది.
భారత్‌ ఎలక్ట్రానిక్స్‌: చంద్రయాన్‌ 3 పేలోడ్స్‌ తయారీ
అనంత్‌ టెక్నాలజీస్‌: ఇస్రో లాంచ్‌ వెహికల్స్‌, శాటిలైట్లు, అంతరిక్ష నౌక పేలోడ్లు వంటి వాటికి వివిధ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌ సబ్‌సిస్టమ్స్‌ తయారు చేస్తోంది. ప్రత్యేకంగా చంద్రయాన్‌- 3 ప్రాజెక్టు కోసం ఇంటర్‌ఫేస్‌ ప్యాకేజెస్‌, పవర్‌ స్విచింగ్‌ మాడ్యూల్స్‌, రిలే అండ్‌ బ్యాలెన్సింగ్‌ యూనిట్స్‌, టెలిమెట్రీ, టెలీకమాండ్‌ వంటి శాటిలైట్‌ సిస్టమ్స్‌,  పవర్‌ మేనేజ్‌మెంట్‌, డీసీ- డీసీ కన్వర్టర్స్‌ అందజేసింది.


అవిశ్రాంత కృషి ఫలించింది

‘‘గత అయిదు దశాబ్దాలుగా ఇస్రోతో కలిసి ఎల్‌అండ్‌టీ పనిచేస్తోంది. పరిశోధన, టెక్నాలజీ ఆవిష్కరణ, అత్యుత్తమ ప్రమాణాలు సాధించడానికి అవిశ్రాం తంగా కృషి చేసిన ఫలితమే నేటి విజయం. తాజా విజయంతో, అంతర్జాతీయ అంతరిక్ష వాణిజ్యంలో భారతదేశం తనకంటూ ఒక స్థానాన్ని సాధించుకున్నట్లే. దీనికి ఇస్రో భాగస్వామిగా ఎంతో సంతోషిస్తున్నాం. ఇస్రో శాస్త్రవేత్తలకు, దేశంలోని శాస్త్ర-సాంకేతిక బృందాలకు అభినందనలు.’’

ఎస్‌.ఎన్‌.సుబ్రమణ్యన్‌, ఎల్‌ అండ్‌ టీ ఎండీ, సీఈఓ


మన సాంకేతిక సత్తాకు ప్రతీక

‘చంద్రయాన్‌-3 ప్రయోగం, అంతరిక్ష పరిశోధనలో మనకు ఉన్న అత్యాధునిక శాస్త్ర- సాంకేతిక పరిజ్ఞానాన్ని, అద్భుత  నైపుణ్యాన్ని, పట్టుదలను ప్రపంచానికి తెలియజెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలందరికీ అభినందనలు. ఈ ప్రాజెక్టులో పాలు పంచుకున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. భవిష్యత్తులో మరెన్నో అంతరిక్ష పరిశోధనలు చేపట్టడానికి, ఇస్రోతో కలిసి ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నాం.’

 డాక్టర్‌ సుబ్బారావు పావులూరి , అనంత్‌ టెక్నాలజీస్‌ ఎండీ


ప్రైవేటు రంగ అంతరిక్ష సంస్థలకు స్ఫూర్తి

‘చంద్రయాన్‌-3 ల్యాండర్‌ ‘విక్రమ్‌’ చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం చారిత్రాత్మక ఘట్టం. ఈ విజయం అంతరిక్ష కార్యక్రమాలకు విడిభాగాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న దేశంలోని ప్రైవేటు రంగ సంస్థలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. ఈ ప్రాజెక్టులో మేమూ క్రియాశీలక పాత్ర పోషించాం. ఎన్నో విడిభాగాలు అందించాం. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు.’’

పర్వత్‌ శ్రీనివాసరెడ్డి , ఎంటార్‌ టెక్నాలజీస్‌ ఎండీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని