సంక్షిప్త వార్తలు(6)

వినియోగదార్లకు ‘ఇ-రసీదు జారీ’ నిబంధన పాటించని వ్యాపారులకు త్వరలోనే సూచనలు పంపడాన్ని ప్రారంభిస్తామని కేంద్ర కస్టమ్స్‌, పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు.

Published : 12 Nov 2023 01:25 IST

‘ఇ-రసీదు జారీ’ నిబంధన పాటించని వ్యాపార సంస్థలకు త్వరలో సూచనలు

దిల్లీ: వినియోగదార్లకు ‘ఇ-రసీదు జారీ’ నిబంధన పాటించని వ్యాపారులకు త్వరలోనే సూచనలు పంపడాన్ని ప్రారంభిస్తామని కేంద్ర కస్టమ్స్‌, పరోక్ష పన్నుల బోర్డు (సీబీఐసీ) ఛైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ తెలిపారు. కాగా.. 2020 నుంచి దశలవారీగా వ్యాపార సంస్థలు ఇ-రసీదులు జారీ చేయడాన్ని సీబీఐసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ‘ఆగస్టు 1 నుంచి రూ.5 కోట్లకు మించి టర్నోవరు ఉన్న వ్యాపారులు ఇ-రసీదులు జారీ చేయడం తప్పనిసరి. అయితే ఈ నిబంధనను చాలా మంది పాటించడం లేదని తెలుస్తోంది. ఇ-రసీదులు పంపాల్సిందిగా ఇటువంటి పన్ను చెల్లింపుదార్లకు సూచనలు పంపిస్తున్నాం. తొలుత ఈ వ్యవహారంపై సరళ వైఖరినే అవలంబించాలని అనుకుంటున్నామ’ని అగర్వాల్‌ తెలిపారు.


అమెరికా రుణ అంచనాలు తగ్గించిన మూడీస్‌

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ రుణాల భవిష్యత్‌ అంచనాను ‘స్థిరత్వం’ నుంచి ‘ప్రతికూలం’కు మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తగ్గించింది. వడ్డీ రేట్లు పెరుగుతుండడం, కాంగ్రెస్‌లో భిన్న రాజకీయ ధోరణులు కనిపిస్తుండడం ఇందుకు కారణాలుగా ఈ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ పేర్కొంది. అయితే ప్రభుత్వ అప్పులపై తన ట్రిపుల్‌-ఏ క్రెడిట్‌ రేటింగ్‌ను మాత్రం కొనసాగించింది.


నాలుగేళ్లలో 1900 కొత్త ఉద్యోగాలు

క్రిటికల్‌రివర్‌

ఈనాడు, హైదరాబాద్‌: సంస్థలకు డిజిటలీకరణ సేవలను అందించే క్రిటికల్‌రివర్‌ తన హైదరాబాద్‌ కేంద్రాన్ని విస్తరించనుంది. తయారీ రంగం, ప్రభుత్వ, ఆర్థిక, లాభాపేక్ష లేని సంస్థలు, హైటెక్‌ సాస్‌ సంస్థలకూ క్రిటికల్‌రివర్‌ సేవలను అందిస్తుంది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఇక్కడ 600 మంది ఉద్యోగులతో కేంద్రాన్ని నిర్వహిస్తోంది. రాబోయే మూడు నుంచి నాలుగేళ్ల కాలంలో ఇక్కడి నుంచి 2,500 మంది నిపుణులు పనిచేస్తారని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎం. అంజి రెడ్డి తెలిపారు. అంటే 1900 కొత్త ఉద్యోగాలు వస్తాయని అన్నారు. కొత్తగా ఐటీ హబ్‌లుగా మారుతున్న నిజామాబాద్‌లాంటి ద్వితీయ శ్రేణి పట్టణాలకూ తమ సంస్థను విస్తరించే ఆలోచన ఉందన్నారు. కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, జెన్‌ఏఐ, సీఆర్‌ఎం తదితర నైపుణ్యాలున్న వారిని తీసుకోబోతున్నట్లు తెలిపారు. ప్రాంగణ నియామకాలకు ప్రాధాన్యం ఇస్తామని, వారికి అవసరమైన నైపుణ్యాలను తామే నేర్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ వల్ల ఉద్యోగుల పని సామర్థ్యాలు మరింత పెరుగుతాయని, కొత్త ఉద్యోగాలు ఎన్నో వస్తాయని తెలిపారు. తాము ఏటా 30-35 శాతం మేర వృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ ఎలాంటి పెట్టుబడులూ తీసుకోలేదన్నారు. నాలుగైదేళ్లలో ఐపీఓకి వెళ్లే ప్రణాళికలున్నాయని తెలిపారు.


20% తగ్గిన ఓఎన్‌జీసీ లాభం

దిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) సెప్టెంబరు త్రైమాసికంలో రూ.10,216 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.12,826 కోట్లతో పోలిస్తే 20 శాతం తగ్గింది. నికర లాభం వరుసగా రెండో త్రైమాసికంలోనూ తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలోనూ లాభం 34 శాతం మేర తగ్గింది. ప్రతి బ్యారెల్‌ ముడి చమురు ఉత్పత్తి, విక్రయంపై ఓఎన్‌జీసీ 84.84 డాలర్లను ఆర్జించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇది 95.50 డాలర్లు కాగా, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 76.49 డాలర్లుగా నమోదైంది. 2022 ఏప్రిల్‌-జూన్‌ సమయంలో రష్యా-ఉక్రెయిన్‌ల యుద్ధ నేపథ్యంలో సరఫరా, గిరాకీ మధ్య అనిశ్చితులతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. సమీక్షా త్రైమాసికంలో ధరలు 80-90 డాలర్ల మధ్య కదలాడాయి. ముడి చమురు ధరలు తక్కువగా ఉండటంతో నికర లాభం తగ్గిందని ఓఎన్‌జీసీ డైరెక్టర్‌ (ఫైనాన్స్‌) పొమిల జస్పాల్‌ వెల్లడించారు. స్థూల ఆదాయం 8.2 శాతం తగ్గి రూ.35,162 కోట్లకు పరిమితమైంది. ముడి చమురు ఉత్పత్తి 1.9 శాతం తగ్గి 4.54 మిలియన్‌ టన్నులకు, గ్యాస్‌ ఉత్పత్తి 3 శాతం తగ్గి 5.01 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్లకు పరిమితమయ్యాయి.


భారత్‌లో 1.62 కోట్ల మందికి నైపుణ్యాల శిక్షణ అవసరం

సర్వీస్‌నౌ నివేదిక

దిల్లీ: భారత్‌లో నైపుణ్యాల లోటును పూడ్చేందుకు కృత్రిమ మేధ, ఆటోమేషన్‌లలో 1.62 కోట్ల మంది ఉద్యోగులకు శిక్షణ అవసరమని సర్వీస్‌ నౌ నివేదిక వెల్లడించింది. కృత్రిమ మేధతో ఉద్యోగ విపణి పూర్తిగా మారుతుందని, డిజిటల్‌ నైపుణ్యాల వల్ల కోట్లాది కొత్త టెక్‌ ఉద్యోగాల సృష్టి సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. కృత్రిమ మేధ, ఆటోమేషన్‌ వల్ల 47 లక్షల కొత్త టెక్‌ ఉద్యోగాలు రావొచ్చని పేర్కొంది. సర్వీస్‌ నౌ కోసం పియర్సన్‌ సంస్థ ఈ అధ్యయనం చేపట్టింది. భారత డిజిటల్‌ నైపుణ్య వ్యవస్థ వృద్ధి దిశగా కొనసాగుతోందని.. 2027 నాటికి భారత్‌కు అదనంగా అప్లికేషన్‌ డెవలపర్లు (75,000), డేటా అనలిస్ట్‌లు (70,000), ప్లాట్‌ఫామ్‌ ఓనర్లు (65,000), ప్రోడక్ట్‌ ఓనర్లు (65,000), ఇంప్లిమెంటేషన్‌ ఇంజినీర్‌లు (55,000) అవసరమవుతారని సర్వీస్‌ నౌ అంచనా వేసింది. నీ తయారీ రంగంలో 23 శాతం మందికి ఆటోమేషన్‌ నైపుణ్యాలఅభివృద్ధి అవసరమని నివేదిక తెలిపింది. తర్వాతి స్థానాల్లో వ్యవసాయం, అటవీ, మత్స్య రంగాలు (22 శాతం), టోకు, రిటైల్‌ వాణిజ్యం (11.6 శాతం), రవాణా, స్టోరేజ్‌ ( 8శాతం), నిర్మాణ (7.8 శాతం) ఉన్నాయి.


బీఎస్‌ఈ లాభం రూ.118 కోట్లు

దిల్లీ: సెప్టెంబరు త్రైమాసికంలో బీఎస్‌ఈ రూ.118.4 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాల లాభం రూ.29.4 కోట్లతో పోలిస్తే ఇది నాలుగింతలు అధికం. ఆదాయం    రూ.240 కోట్ల నుంచి 53 శాతం పెరిగి రూ.367 కోట్లకు చేరింది. ఈక్విటీ విభాగంలో ఎక్స్ఛేంజ్‌ సరాసరి రోజువారీ టర్నోవర్‌ రూ.4,740 కోట్ల నుంచి రూ.5,922 కోట్లకు చేరింది. ‘మానవ వనరుల అభివృద్ధి, కొత్త ఉత్పత్తులు, సాంకేతికత మౌలిక వసతులు తదితర వాటిపై మా పెట్టుబడులు కొనసాగిస్తామ’ని బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ సుందరరామన్‌ రామమూర్తి వెల్లడించారు. రైట్స్‌ ఇష్యూలో పాల్గొని ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా ఇండియా ఇంటర్నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌(ఐఎఫ్‌ఎస్‌సీ) లిమిటెడ్‌(ఇండియా ఐఎన్‌ఎక్స్‌)లోకి రూ.22.36 కోట్లు, ఇండియా ఇంటర్నేషనల్‌ క్లియరింగ్‌ కార్పొరేషన్‌(ఐఎఫ్‌ఎస్‌సీ) లిమిటెడ్‌(ఇండియా ఐసీసీ)లోకి రూ.33.88 కోట్ల నిధులు చొప్పించేందుకు బీఎస్‌ఈ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని