ఆనంద్‌ మహీంద్రా వితరణ

హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది.

Published : 27 Mar 2024 01:19 IST

మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు

దిల్లీ: హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న మహీంద్రా యూనివర్సిటీకి రూ.500 కోట్లు ఇవ్వనున్నట్లు మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, ఆయన కుటుంబం ప్రకటించింది. ఈ నిధులతో మహీంద్రా యూనివర్సిటీలో వచ్చే అయిదేళ్లలో కొత్త విభాగాల్లో కోర్సులు ప్రారంభిస్తారు. మహీంద్రా యూనివర్సిటీని ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు అమలు చేస్తారు. ఇదే కాకుండా ఆనంద్‌ మహీంద్రా తల్లి పేరు మీద ఏర్పాటు చేసిన ‘ఇందిరా మహీంద్రా స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌’కు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆనంద్‌ మహీంద్రా వ్యక్తిగత హోదాలో రూ.50 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ స్కూల్‌ను విద్యా రంగంలో పరిశోధన, ఆవిష్కరణలకు సంబంధించిన అంశాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. 

2020లో ఏర్పాటు: మహీంద్రా యూనివర్సిటీ 2020 మే లో హైదరాబాద్‌ శివార్లలోని బహదూర్‌పల్లిలో ఏర్పాటైంది. టెక్‌ మహీంద్రా మాజీ వైస్‌ఛైర్మన్‌ వినీత్‌ నయ్యర్‌ దీనికి ఆద్యులు. ఈ యూనివర్సిటీ ప్రస్తుతం అయిదు స్కూళ్లలో 35 రకాల కోర్సులు అందిస్తోంది. ఇందులో అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డాక్టరేట్‌ కోర్సులు ఉన్నాయి. దాదాపు 4,100 మంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో వివిధ ప్రోగ్రాముల్లో ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో స్కూల్‌ ఆఫ్‌ హాస్పిటాలిటీ ప్రారంభం కాబోతోంది. దీంతో పాటు స్కూల్‌ ఆఫ్‌ లిబరల్‌ ఆర్ట్స్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. మహీంద్రా  యూనివర్సిటీకి పలు అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉన్నాయి. కార్నెల్‌ ఎస్‌సీ జాన్సన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌- వర్జీనియా టెక్‌, బాబ్సన్‌ కాలేజ్‌- యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడా, లా ట్రోబ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇంకా మరికొన్ని సంస్థలతో కరిక్యులమ్‌ బిల్డింగ్‌, స్టూడెంట్‌/ ఫ్యాకల్టీ మార్పిడి ప్రోగ్రామ్‌లు, పరిశోధనా భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని