Adani Group: ‘అదానీ’లో జీక్యూజీ పెట్టుబడి.. ఇప్పటికే 60% లాభం!

Adani Group: హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ షేర్లు పతనమైన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ సమయంలో జీక్యూజీ పార్ట్‌నర్స్‌ అదానీ గ్రూప్‌ షేర్లను కొనుగోలు చేసింది.

Published : 24 May 2023 16:42 IST

దిల్లీ: జీక్యూజీ పార్ట్‌నర్స్‌ (GQG Partners).. ఇది అమెరికాకు చెందిన ఓ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీ. హిండెన్‌బర్గ్‌ నివేదిక తర్వాత అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సరిగ్గా ఆ సమయంలోనే అదానీ షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ పెట్టుబడులు మంచి ప్రతిఫలం ఇస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

కష్టకాలంలో ఈక్విటీ వాటాలు కొనుగోలు చేసి ‘అదానీ’కి జీక్యూజీ పార్ట్‌నర్స్‌ (GQG Partners) ఒకరకంగా అండగా నిలిచింది. అలా సమీకరించిన నిధులను అప్పులు చెల్లించడానికి అదానీ గ్రూప్‌ (Adani Group) వినియోగించుకుంది. దీంతో ఇన్వెస్టర్లలో ఈ కంపెనీల స్టాక్స్‌పై విశ్వాసం పెరిగింది. మరోవైపు ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ షేర్ల ర్యాలీకి దోహదం చేసిన విషయం తెలిసిందే. దీంతో జీక్యూజీ (GQG Partners) పెట్టిన పెట్టుబడులు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి.

ఫిబ్రవరి 24న హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడింది. అప్పటి నుంచి అదానీ స్టాక్స్‌ (Adani Group stocks) పతనం ప్రారంభమైంది. మార్చి 2న అదానీ గ్రూప్‌లోని కొన్ని కంపెనీల షేర్లను జీక్యూజీ (GQG Partners) కొనుగోలు చేసింది. దాదాపు రూ.15,444 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు రాజీవ్‌ జైన్ వెల్లడించారు. అప్పటి నుంచి స్టాక్స్‌ పెరిగిన తీరును బట్టి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 60 శాతం వృద్ధి నమోదైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కన జీక్యూజీ పెట్టుబడి దాదాపు రూ.24 వేల కోట్లు దాటింది! అయితే, ఏయే కంపెనీలో ఎంత మేర పెట్టుబడిగా పెట్టారు? అవి ఎంత మేర వృద్ధి చెందాయనేది మాత్రం స్పష్టంగా తెలియదు.

అదానీ గ్రూప్‌ (Adani Group)లో తమ వాటాను మరింత పెంచుకుంటున్నట్లు జీక్యూజీ (GQG Partners) మంగళవారం ప్రకటించింది. భారత్‌లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్న అదానీ గ్రూప్‌ రానున్న రోజుల్లో మదుపర్లకు మంచి ప్రతిఫలాలను అందిస్తుందని రాజీవ్‌ జైన్‌ ఓ కంపెనీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో అదానీ గ్రూప్‌లో తమ వాటాను మరింత పెంచుకుంటామని వెల్లడించారు.

(గమనిక: పై సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్న అంశం. ఏ స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలనేది పూర్తిగా ఇన్వెస్టర్ల వ్యక్తిగత వ్యవహారం. ఒక స్టాక్‌ను కొనుగోలు చేయాలనిగానీ, విక్రయించాలనిగానీ ఈనాడు.నెట్ సూచించడం లేదు.)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని