GST collections: సెప్టెంబరు జీఎస్‌టీ వసూళ్లు రూ.1.62 లక్షల కోట్లు.. 10% వృద్ధి

GST collections: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు జీఎస్‌టీ వసూళ్లు (GST collections) రూ.1.60 లక్షల కోట్లు దాటడం విశేషం.

Published : 01 Oct 2023 17:05 IST

దిల్లీ: సెప్టెంబరులో వస్తు, సేవల పన్ను వసూళ్లు (GST collections) 10% పెరిగి రూ.1.62 లక్షల కోట్లకు చేరాయి. 2022 సెప్టెంబరులో ఇవి రూ.1.47 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సెప్టెంబరులో స్థూలంగా జీఎస్‌టీ వసూళ్లు (GST collections) రూ.1,62,712 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్‌టీ (CGST) రూ.29,818 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ (SGST) రూ.37,657 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.83,623 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.41,145 కోట్లతో కలిపి), సెస్సు రూ.11,613 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.881 కోట్లతో కలిపి)గా ఉన్నాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు నాలుగు సార్లు జీఎస్‌టీ వసూళ్లు (GST collections) రూ.1.60 లక్షల కోట్లు దాటడం విశేషం. ఈ ఏడాది ప్రథమార్ధంలో రూ.9,92,508 కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 11 శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ వసూళ్లు (GST collections) రూ.1.65 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత నెల వసూళ్లలో ఐజీఎస్‌టీ (IGST) నుంచి కేంద్రం రూ.33,736 కోట్లు సీజీఎస్‌టీ (CGST), రూ.27,578 కోట్లు ఎస్‌జీఎస్‌టీ (SGST) కింద సర్దుబాటు చేసింది. ఫలితంగా గత నెలలో కేంద్ర ప్రభుత్వ సీజీఎస్‌టీ (CGST) ఆదాయం రూ.63,555 కోట్లు, రాష్ట్రాల ఎస్‌జీఎస్‌టీ (SGST) ఆదాయం రూ.65,235 కోట్లుగా నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని