HDFC Bank: అదరగొట్టిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌.. లాభంలో 29 శాతం వృద్ధి

HDFC Bank Q1 Results: త్రైమాసిక ఫలితాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అదరగొట్టింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.12,370.38  కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.

Updated : 17 Jul 2023 14:44 IST

ముంబయి: ప్రైవేటురంగ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ (HDFC Bank) ఆకర్షణీయ త్రైమాసిక ఫలితాలను (Q1 Results) ప్రకటించింది. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.12,370.38 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 29.13 శాతం పెరగడం గమనార్హం. గతేడాది రూ.9,579.11 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటించగా.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో రూ.12,594.47 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. నికర వడ్డీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.23,599 కోట్లుగా నమోదు చేసింది. 

హెచ్‌డీఎఫ్‌సీ... గెలుపంటే ఇదీ!

సమీక్షా త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆదాయం రూ.62,021 కోట్లకు పెరిగింది. గతేడాది ఆదాయం రూ.44,202 కోట్లు మాత్రమే. నిర్వహణ వ్యయాలు రూ.11,355 కోట్ల నుంచి రూ.15,177 కోట్లకు పెరిగినట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గతేడాది 1.28 శాతంగా ఉన్న స్థూల నిరర్థక ఆస్తులు 1.17 శాతానికి తగ్గినట్లు బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ మొత్తం డిపాజిట్లు 19 శాతం పెరిగి 19.13 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం అనంతరం వెలువడిన తొలి ఫలితాలు ఇవే కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని