Hero MotoCorp: అదరగొట్టిన హీరో మోటోకార్ప్‌.. నికర లాభం ₹811 కోట్లు

Hero MotoCorp and TVS Q4 Results: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలు హీరో మోటోకార్ప్‌, టీవీఎస్‌ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. రెండు సంస్థలూ ఫలితాల్లో అదరగొట్టాయి.

Published : 04 May 2023 19:57 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హీరో మోటోకార్ప్‌ (Hero MotoCorp) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2022-23 చివరి త్రైమాసికంలో (Q4 results) అంచనాలను మించి రాణించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన పన్ను అనంతరం రూ.811 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాదితో రూ.621 కోట్లతో పోలిస్తే ఇది 31 శాతం అధికం. మొత్తం ఆదాయం సైతం రూ.7,628 కోట్ల నుంచి రూ.8672 కోట్లకు పెరిగిందని కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

  • జనవరి-మార్చి త్రైమాసికంలో 12.70 లక్షల యూనిట్లను హీరో విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో 11.89 లక్షల యూనిట్లతో పోలిస్తే విక్రయాలు 7 శాతం మేర పెరిగాయి. మొత్తం ఏడాదిలో విక్రయాలు 49.44 లక్షల యూనిట్ల నుంచి 53.29 లక్షలకు పెరిగాయి.
  • మొత్తం ఏడాదికి గానూ కంపెనీ ఏకీకృత ప్రాతిపదికన నికర లాభం రూ.2,329 కోట్ల నుంచి రూ.2800 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం సైతం రూ.30,106 కోట్ల నుంచి రూ.34,727 కోట్లకు పెరిగింది.
  • 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ.2 ముఖ విలువ ఒక్కో షేరుకు రూ.35 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించేందుకు హీరో మోటోకార్ప్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

సీఈవో మాట

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో వివిధ సెగ్మెంట్లలో కొత్త ప్రొడక్ట్‌లను లాంచ్‌ చేయనున్నామని హీరో మోటోకార్ప్‌ సీఈఓ రంజన్‌ గుప్తా తెలిపారు. ప్రీమియం పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడంతో పాటు.. ప్రస్తుతం ఉన్న మోడళ్ల ప్రీమియమైజ్‌ చేయాలనుకుంటున్నామని తెలిపారు. విడా విద్యుత్‌ స్కూటర్ల కోసం ఇప్పటికే ఉన్న తమ డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను వినియోగించుకోనున్నట్లు  చెప్పారు. వచ్చే ఏడాది ద్విచక్ర వాహన పరిశ్రమ ఆదాయం రెండింతల వృద్ధి సాధించనుందని అంచనా వేశారు.

  • ఫలితాల వెల్లడి నేపథ్యంలో గురువారం బీఎస్‌ఈలో హీరో మోటోకార్ప్‌ షేరు 0.43 శాతం లాభంతో రూ.2,514.05 వద్ద ముగిసింది.

టీవీఎస్‌ లాభం 21 శాతం జంప్‌

మార్చితో ముగిసిన త్రైమాసికంలో (Q4 results) టీవీఎస్‌ మోటార్‌ (TVS Motor) కంపెనీ ఏకీకృత నికర లాభం 21 శాతం వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.277 కోట్లుగా ఉన్న నికర లాభం రూ.336 కోట్లకు పెరిగింది. పెరిగిన వాహన విక్రయాలు ఇందుకు దోహదం చేశాయి. కార్యకలాపాల ఆదాయం రూ.6,585 కోట్ల నుంచి రూ.8031 కోట్లకు పెరిగినట్లు టీవీఎస్‌ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

జనవరి- మార్చి త్రైమాసికంలో మొత్తం 8.68 లక్షల యూనిట్లను టీవీఎస్‌ విక్రయించింది. మొత్తం ఏడాదికి గానూ రూ.1329 కోట్ల నికర లాభాన్ని, రూ.31,974 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. సంవత్సరం మొత్తానికి గానూ 11 శాతం వృద్ధితో 36.82 లక్షల యూనిట్లు (ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు) విక్రయించినట్లు కంపెనీ తెలిపింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో కంపెనీ షేరు 1.12 శాతం లాభపడి రూ.1169.85 వద్ద ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని