Hyundai Airbags: హ్యుందాయ్‌ అన్ని కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

Hyundai Airbags: తమ కార్లలో అన్ని మోడళ్లకూ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికం చేసినట్లు హ్యుందాయ్‌ తెలిపింది.

Published : 03 Oct 2023 18:21 IST

దిల్లీ: కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) ఎయిర్‌బ్యాగ్‌ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ అన్ని మోడల్‌ కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల (airbags)ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తద్వారా ఇటీవలే తీసుకొచ్చిన భారత్‌ ఎన్‌క్యాప్‌ (Bharat New Car Assesment Programme- BNCAP) విధానంలో స్వచ్ఛందంగా భాగస్వాములవుతున్నట్లు పేర్కొంది. కార్లలో ప్రయాణికుల భద్రతా ప్రమాణాలను పరీక్షించి సేఫ్టీ రేటింగ్‌ ఇచ్చే కొత్త విధానమే ఈ భారత్‌ ఎన్‌క్యాప్‌.

తొలుత మూడు మోడళ్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌ల (airbags)ను అన్ని వేరియంట్లలో ప్రామాణికం చేస్తున్నట్లు హ్యుందాయ్‌ (Hyundai Motor India) తెలిపింది. దశలవారీగా దీన్ని ఇతర మోడళ్లకూ విస్తరించనున్నట్లు తెలిపింది. మరోవైపు తమ మిడ్‌ సైజ్‌ సెడాన్‌ వెర్నా కారుకు గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో అడల్ట్‌, చైల్డ్‌ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌ లభించినట్లు తెలిపింది. ప్రయాణికులందరి భద్రత తమ తొలి ప్రాధాన్యమని హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా (Hyundai Motor India) ఎండీ, సీఈఓ ఉన్సూ కిమ్‌ తెలిపారు. రోడ్‌ నెట్‌వర్క్‌ విస్తరిస్తుండడం, స్పీడ్‌ లిమిట్స్‌ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను అప్‌గ్రేడ్‌ చేయడం తప్పనిసరని సీఓఓ తరుణ్‌ గార్గ్‌ అభిప్రాయపడ్డారు. అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెన్స్‌ సిస్టమ్‌ (ADAS) సహా ఇతర కనెక్టెడ్‌ ఫీచర్లను అన్ని మోడళ్లకూ విస్తరించే యోచనలోనూ ఉన్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని