India - France: మోదీ - మెక్రాన్‌ల భేటీ.. ఏవియేషన్‌ రంగంలో కీలక ఒప్పందాలు

ఫ్రాన్స్ అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాలకు చెందిన సంస్థల మధ్య కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ తెలిపింది. 

Published : 26 Jan 2024 19:44 IST

దిల్లీ: ఫ్రాన్స్‌ (France) అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ (Emmanuel Macron) భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వైమానిక రంగంలో పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వత్రా తెలిపారు. ఇది రక్షణ రంగంలో ఉమ్మడి కార్యాచరణతో ముందుకుసాగేందుకు తోడ్పడుతుందని వెల్లడించారు. ఇందులోభాగంగా రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీతో పాటు సైనిక అవసరాలకు సాంకేతిక సహకారం, అంతరిక్ష, సైబర్‌స్పేస్, కృత్రిమమేధ, రోబోటిక్స్, స్వయం చోదిత వాహనాలు వంటి రంగాల్లో సహాయసహకారాలు అందజేసుకోనున్నాయి. 

‘థాంక్యూ ఇండియా’.. వీడియో షేర్‌ చేసిన మెక్రాన్‌

గురువారం జైపుర్‌లో మెక్రాన్‌తో ప్రధాని మోదీ (PM Modi) ద్వైపాక్షిక చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా టాటా-ఎయిర్‌బస్‌ సంస్థలు హెలికాఫ్టర్‌ తయారీకి ఒప్పందం చేసుకున్నాయి. ఈ రెండు కలిసి హెచ్‌125 హెలికాఫ్టర్‌లను ఉత్పత్తి చేయనున్నాయి. ఇప్పటికే వీటి భాగస్వామ్యంలో గుజరాత్‌లోని ప్లాంట్‌లో సీ-295 రవాణా విమానాల తయారీ జరుగుతోంది. నింగిలోకి ఉపగ్రహాలను పంపేందుకు న్యూ స్పేస్‌ ఇండియా-ఏరియన్‌ స్పేస్‌ సంస్థల మధ్య ఒప్పందం జరిగిందని వినయ్‌ క్వత్రా తెలిపారు. గాజాలో తాజా పరిస్థితులు, ఉగ్రవాదం, ఎర్రసముద్రంలో ఉద్రిక్తతలపై కూడా ఇరు దేశాధినేతలు చర్చించినట్లు వెల్లడించారు. దేశీయంగా విమాన ఇంజిన్ల తయారీకి సంబంధించి భారత్‌కు వంద శాతం పూర్తి సహాయసహకారాలు అందించేందుకు శాఫ్రాన్‌ సంస్థ సుముఖంగా ఉందని భారత్‌లోని ఫ్రాన్స్ రాయబారి జావేద్‌ అష్రఫ్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని