Financial incentives: ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌ తయారీ కంపెనీలకు భారీ ప్రోత్సాహకాలు?

భారత్‌లో ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తయారు చేసే కంపెనీలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం....

Updated : 29 Sep 2022 14:46 IST

దిల్లీ: తయారీలో చైనాను అధిగమించేందుకు భారత్‌ వేగంగా అడుగులు వేస్తోంది. మేకిన్‌ ఇండియా, పీఎల్‌ఐ.. వంటి కార్యక్రమాల ద్వారా ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. తాజాగా ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు తయారు చేసే కంపెనీలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. యాపిల్‌, డెల్‌ వంటి బడా సంస్థల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి తెలిపినట్లు బ్లూమ్‌బెర్గ్‌ పేర్కొంది.

దీనికి సంబంధించిన విధానాన్ని ఇప్పటికే అభిప్రాయ సేకరణ కోసం ఆయా పరిశ్రమల ప్రతినిధులకు పంపినట్లు సదరు వ్యక్తి తెలిపారు. ఒక్కో కంపెనీకి దాదాపు రూ.40 వేల కోట్ల వరకు ప్రోత్సాహకాలు ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల తయారీని పెంచి దిగుమతులను తగ్గించుకోవాలని భారత్‌ యోచిస్తోంది. అలాగే దీర్ఘకాలంలో వీటి ఎగుమతిలో దేశాన్ని అగ్రభాగాన నిలపాలని ప్రణాళికలు రచిస్తోంది. 

ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ పరికరాల తయారీలో ఉన్న యాపిల్‌, డెల్‌, హెచ్‌పీ, ఆసుస్‌టెక్‌ కంప్యూటర్‌ వంటి దిగ్గజ కంపనీలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కంపెనీలు దేశీయంగా తయారీని ప్రారంభించేలా ప్రోత్సహించాలని చూస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే స్థానికంగా ఐఫోన్ల తయారీని చేపట్టిన యాపిల్‌ ఇక్కడే ఐప్యాడ్‌లను కూడా ఉత్పత్తి చేసేలా చేయాలన్నది ప్రభుత్వ యోచన అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి తెలిపారు.

ప్రభుత్వం ఇవ్వబోయే ఈ ప్రోత్సాహకాలకు విదేశీ కంపెనీలు ఎంపిక కావడానికి ప్రభుత్వం కొన్ని షరతులు కూడా విధించే అవకాశం ఉందని తెలుస్తోంది.  వచ్చే ఐదేళ్ల పాటు కనీసం 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించిన కంపెనీలను ఎంపిక చేయొచ్చని సమాచారం. అలాగే ఆయా కంపెనీలు స్థానిక విడిభాగాల కొనుగోలుపై ప్రోత్సాహకాల మొత్తం ఆధారపడి ఉంటుందని సమాచారం. పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరిపిన తర్వాత ఈ విధానంలో మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. గత ఏడాదే ప్రభుత్వం ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్లు, పీసీల తయారీ పరిశ్రమ కోసం రూ.73,500 కోట్ల ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రకటించింది. కానీ, ప్రోత్సాహకాల పరిమాణం తక్కువ ఉండడంతో కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని