Nirmala Sitharaman: భారత ఆర్థిక వృద్ధికి బయటి నుంచే సవాళ్లు: సీతారామన్‌

Nirmala Sitharaman: భారత ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన సంస్కరణలు, డిజిటలైజేషన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉందని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. అయితే, బయట నుంచి సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.

Published : 16 Apr 2023 21:35 IST

దిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధికి దేశం వెలుపలి నుంచే సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. అధిక ముడి చమురు ధరలు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం రూపంలో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. ఇటీవల ఒపెక్‌ ప్లస్‌ తీసుకున్న చమురు ఉత్పత్తి కోత నిర్ణయం ఇంధన ధరలపై ఒత్తిడిని పెంచే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఆమె శనివారం జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

అమెరికా సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక మాంద్యం (Recession) వస్తే ఆ ప్రభావం కూడా భారత్‌పై ఉంటుందని సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. ఎగుమతులు తగ్గిపోతాయని.. తద్వారా తయారీ సైతం మందగిస్తుందని తెలిపారు. భారత ప్రభుత్వం తీసుకుంటున్న విధానపరమైన సంస్కరణలు, డిజిటలైజేషన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రస్తుతానికి స్థిరంగా ఉందన్నారు.

ద్రవ్యోల్బణ కట్టడి నిమిత్తం వడ్డీరేట్ల పెంపు విషయంలో కొన్ని దేశాలు ఇక అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ను అనసరించాల్సిన అవసరం లేదని సీతారామన్‌ (Nirmala Sitharaman) అభిప్రాయపడ్డారు. ద్రవ్య పరపతి విధానాన్ని కఠినతరం చేసే ప్రక్రియకు విరామం ఇవ్వడం వల్ల కొన్ని దేశాల్లో వృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు. ఫలితంగా ఆయా దేశాల్లోని స్థానిక సమస్యలకు అనుగుణంగా వారు నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని