World bank: భారత వృద్ధి 6.3%.. ప్రపంచబ్యాంక్‌ వెల్లడి.. ద్రవ్యోల్బణ అంచనాలు పెంపు

World bank on Indian Economy: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ 6.3 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. వృద్ధి అంచనాలను స్థిరంగా ఉంచింది.

Updated : 03 Oct 2023 15:12 IST

దిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి (Indian Economy) అంచనాలను ప్రపంచబ్యాంక్‌ (World bank) వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023-24) 6.3 శాతం వృద్ధిని నమోదు కావొచ్చని పేర్కొంది. పెట్టుబడులకు అనుకూల వాతావరణం, దేశీయ డిమాండ్‌ ఇందుకు కారణమని పేర్కొంది. అదే సమయంలో ద్రవ్యోల్బణ అంచనాలను మాత్రం సవరించి 5.9 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్‌ ఓ నివేదికను విడుదల చేసింది.

ప్రపంచ భౌగోళిక సవాళ్లు ఎదురవుతున్నా భారత్‌ వృద్ధిని నమోదు చేయగలదని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. స్వల్పకాలంలో కొన్ని సవాళ్లు ఎదురైనా.. కొనుగోళ్లు, ప్రైవేటు పెట్టుబడులతో భారత్‌కు అనుకూల వాతావరణం నెలకొందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. తదుపరి రెండేళ్ల పాటు పూర్తి ఆర్థిక సంవత్సరానికి వృద్ధి 6.4 శాతం, 6.5 శాతం చొప్పున నమోదు కావొచ్చని పేర్కొంది. ఒకవైపు అంతర్జాతీయంగా సవాళ్లు ఉన్నప్పటికీ.. జీ20 దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ నిలుస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాల సగటు కంటే రెట్టింపు వృద్ధితో దూసుకెళ్తుతోందని తన నివేదికలో పేర్కొంది. అంతకుముందు ఏప్రిల్‌ నెల సమీక్షలో భారత వృద్ధి అంచనాలను ప్రపంచబ్యాంక్‌ తగ్గించింది. 6.6 శాతంగా ఉన్న అంచనాలను 6.3 శాతానికి కుదించింది. 

గూగుల్‌ విధానాలే.. ప్రత్యర్థుల ఎదుగుదలకు అడ్డు: సత్య నాదెళ్ల

ఓ వైపు వృద్ధి అంచనాలను స్థిరంగా ఉంచిన ప్రపంచబ్యాంక్‌, ద్రవ్యోల్బణ అంచనాలను మాత్రం పెంచింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వ చర్యల కారణంగా వస్తువుల సరఫరా మెరుగుపడుతుందని ప్రపంచ బ్యాంక్‌ పేర్కొంది. ఏప్రిల్‌లో 5.2 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ అంచనాలను తాజాగా 5.9 శాతానికి పెంచింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా జులైలోలో ఆహార పదార్థాల ధరలు పెరిగాయని, ఆగస్టులో తగ్గినప్పటికీ.. మిగిలిన నెలల్లో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగే అవకాశం ఉందని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల ఆందోళనకరం కానుందని పేర్కొంది.  వచ్చే ఏడాదికి 4.7 శాతం, ఆ మరుసటి ఆర్థిక సంవత్సరంలో 4.1 శాతంగా ద్రవ్యోల్బణం నమోదు కావొచ్చని ప్రపంచబ్యాంక్‌ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని