India Exports Imports: 2023లో భారత వస్తు సేవల ఎగుమతుల్లో స్వల్ప వృద్ధి

India Exports Imports: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌- హమాస్‌ ఘర్షణలు, ఎర్రసముద్రంలో హౌతీల దాడుల వల్ల గత ఏడాది వస్తువుల ఎగుమతులు దెబ్బతిన్నాయి.

Published : 21 Jan 2024 15:23 IST

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. 2023లో భారత వస్తు సేవల ఎగుమతుల (Indian Exports) విలువ 0.4 శాతం పెరిగి 765.6 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్‌, ఔషధ, పత్తి, వస్త్ర, సిరమిక్‌, మాంసం, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల ఎగుమతులు అందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

ఒక్క వస్తువుల ఎగమతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది 4.71 శాతం తగ్గి 431.9 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చాయి. సేవల ఎగమతులు (Imports) మాత్రం 7.88 శాతం పుంజుకొని 388.8 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అదే సమయంలో వస్తువుల దిగుమతులు సైతం ఏడు శాతం తగ్గి 667.73 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. భారత ఎగుమతులు ప్రధానంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్‌, బంగ్లాదేశ్‌, యూకే, జర్మనీలకు చేరాయి.

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, ఇజ్రాయెల్‌- హమాస్‌ ఘర్షణలు, ఎర్రసముద్రంలో హౌతీల దాడుల వల్ల గత ఏడాది సరకుల ఎగుమతులు దెబ్బతిన్నాయి. ఒకవేళ ఇవి ఇలాగే కొనసాగితే ప్రపంచ వాణిజ్యంపై ఆ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు భారత ఎగుమతులు, దిగుమతుల విలువ 2023లో వార్షిక ప్రాతిపదికన 2.6 శాతం కుంగి 1,609 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు ‘గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనీషియేటివ్‌ (GTRI)’ ఇటీవల తెలిపింది. ఎగుమతులు, దిగుమతుల మధ్య తేడా 141.3 బిలియన్‌ డాలర్ల నుంచి 75.2 బిలియన్‌ డాలర్లకు తగ్గింది.

ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ - డిసెంబర్‌ మధ్య వస్తువుల ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 5.7 శాతం తగ్గి 317.12 బిలియన్‌ డాలర్లకు దిగొచ్చాయి. దిగుమతుల విలువ 7.93 శాతం కుంగి 505.15 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీంతో తొలి మూడు త్రైమాసికాల్లో 188.02 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని