2023లో IPO మదుపర్లకు లాభాల పంట.. 59లో 55 కంపెనీల రాబడి 45%

IPOs: ఈ ఏడాదిలో మొత్తం 59 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. వీటిలో 55 కంపెనీల షేర్లు ఏడాది ముగిసే నాటికి 45 శాతానికి పైగా ప్రతిఫలాన్నివ్వడం విశేషం.

Published : 31 Dec 2023 18:13 IST

ముంబయి: ఈ ఏడాది మొత్తం మెయిన్‌బోర్డులో 59 కంపెనీలు ఐపీఓకి (IPO) వచ్చాయి. వీటిలో 55 సంస్థలు సగటున 45 శాతానికి పైగా రాబడినివ్వడం విశేషం. అదే సమయంలో ఈ ఏడాది ఈక్విటీ మార్కెట్‌ ప్రధాన సూచీలు 20 శాతం ర్యాలీ అయ్యాయి. 59 కంపెనీలు కలిపి రూ.54 వేల కోట్ల నిధులను సమీకరించాయి.

59 ఐపీఓల సగటు లిస్టింగ్‌ (IPO Listings) లాభం 26.3 శాతంగా ఉంది. అలాగే అవన్నీ కలిపితే డిసెంబర్‌ 29న మార్కెట్లు ముగిసే నాటికి 45 శాతం రాబడినిచ్చాయి. కేవలం నాలుగు మాత్రమే ఏడాది ముగిసే సరికి ఇష్యూ ధరతో పోలిస్తే దిగువన ట్రేడవుతున్నాయి. ఐపీఓకి వచ్చిన 59 కంపెనీల్లో 23 షేర్లు లిస్టింగ్‌ నుంచి ఇప్పటి వరకు 50 శాతానికి పైగా ర్యాలీ అయ్యాయి. తొమ్మిది కంపెనీ షేర్లు ఇష్యూ ధర కంటే 67 శాతానికి పైగా పుంజుకున్నాయి.

2023లో ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీల్లో ‘ఇండియన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ (IRDEA)’ మదుపర్లకు అన్నింటికంటే మెరుగైన ప్రతిఫలాన్ని ఇచ్చింది. నవంబరు 29న లిస్టయిన ఈ కంపెనీ షేర్లు ఇష్యూ ధరతో పోలిస్తే 221.3 శాతం రాబడినిచ్చాయి. డిసెంబర్‌ 29న ఈ ఏడాది ట్రేడింగ్‌ ముగిసే నాటికి 204 శాతం లాభాన్నిచ్చాయి. తర్వాత సైయెంట్‌ డీఎల్‌ఎం ఇష్యూ ధర రూ.265తో పోలిస్తే 154.5 శాతం, నెట్‌వెబ్‌ టెక్నాలజీస్‌ రూ.500 ఇష్యూ ధర కంటే 140.7 శాతం పుంజుకున్నాయి.

లిస్టింగ్‌ రోజు అత్యధిక లాభాన్నిచ్చిన కంపెనీల జాబితాలో ఐఆర్‌డీఈఏ తర్వాత టాటా టెక్‌ నిలిచింది. రూ.500 ఇష్యూ ధరతో పోలిస్తే 136 శాతం రాబడినిచ్చింది. తర్వాత సిగ్నేచర్‌ గ్లోబల్‌ రూ.385 ఇష్యూ ధర కంటే 128 శాతం పుంజుకుంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఐపీఓల పరంగా చూస్తే 240 ఇష్యూలతో చైనా తొలిస్థానంలో ఉంది. మొత్తం 60 బిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించాయి. తర్వాతి స్థానంలో భారత్‌ నిలిచింది. స్థూల ఆర్థిక పరిస్థితులు బలంగా ఉండడం, రాజకీయ సుస్థిరత, ఆశావహ కార్పొరేట్‌ ఫలితాలు, వడ్డీరేట్ల కోత సంకేతాలు, రిటైల్‌ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం స్టాక్ మార్కెట్లతో పాటు ఐపీఓల సెంటిమెంట్‌ను బలపర్చాయి. దాదాపు 2.7 కోట్ల కొత్త ఇన్వెస్టర్లు ఈసారి మార్కెట్‌లోకి ప్రవేశించడం గమనార్హం.

మరోవైపు 59 మెయిన్‌బోర్డ్‌ ఐపీఓలతో పాటు ఎస్‌ఎంఈ సెగ్మెంట్‌లో 182 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని