PAN Aadhaar Link: ఆధార్‌-పాన్‌ అనుసంధానానికి నేడే ఆఖరు.. లింక్‌ చేయకపోతే ఏమవుతుందంటే?

PAN Aadhaar Link: ఆధార్‌తో పాన్‌ను అనుసంధానం చేశారా? లింక్‌ చేయడానికి నేడు ఆఖరు తేదీ. లింక్‌ చేయకపోతే రేపటి నుంచి పాన్‌ నంబరు పనిచేయదు. మరి అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయంటే..?

Updated : 30 Jun 2023 12:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాశ్వత ఖాతా సంఖ్య (పాన్‌) ఉన్న ప్రతి వ్యక్తీ.. ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం దానికి ఆధార్‌ సంఖ్యను అనుసంధానం (PAN Aadhaar Link) చేయాల్సిందే. ఈ పాన్‌-ఆధార్‌ లింక్‌ గడువు నేటితో ముగియనుంది. జులై 1వ తేదీ నుంచి ఆధార్‌తో అనుసంధానం చేయని పాన్‌ ఖాతాలు పనిచేయవని ఇప్పటికే ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది.

నిజానికి పాన్‌-ఆధార్‌ లింక్‌ (PAN Aadhaar Link)కు గడువు ఎప్పుడో ముగిసింది. అనంతరం రూ.1000 అపరాధ రుసుముతో తొలి మార్చి 31, ఆ తర్వాత జూన్‌ 30 వరకు అదనపు గడువు కల్పించారు. ఇప్పుడు ఆ సమయం కూడా నేటితో ముగుస్తోంది. అయితే, ఈ గడువును మరోసారి పెంచే అవకాశమున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. దీనిపై ప్రభుత్వం మాత్రం ఇంకా స్పష్టతనివ్వలేదు. ఆధార్‌తో పాన్‌ అనుసంధానం చేసుకోవాలని చాలా కాలంగా ఆదాయపు పన్ను శాఖ చెబుతూ వస్తున్నా.. ఇంకా చాలా మంది భేఖాతరు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ రెండింటిని అనుసంధానం చేసినట్లయితే వారి ఆర్థిక లావాదేవీలు పూర్తిగా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. ఇందువల్లనే చాలా మంది పాన్‌ కార్డుదారులు ఆధార్‌తో అనుసంధానం చేసుకునేందుకు వెనుకాడుతున్నారు.

చెక్‌ చేసుకోండిలా..

అనుసంధానం చేశామా... లేదా అన్న అనుమానం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌లోకి వెళ్లి తనిఖీ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ వెబ్‌సైట్‌లో లింక్‌ ఆధార్‌ స్టేటస్‌పై క్లిక్‌ చేసి ఈ వివరాలను తెలుసుకోవచ్చు. ఇది వరకు అనుసంధానం చేసి ఉంటే.. చేసినట్లు సందేశం వస్తుంది. లేదంటే ఫైన్‌ చెల్లించి అనుసంధానం చేసుకునేందుకు అవకాశం ఇస్తూ ఆప్పన్లు కనిపిస్తాయి. ఆపరాధ రుసుం రెండు విధాలా చెల్లించొచ్చని...ఒకటి ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్‌ నుంచి కానీ, రెండోది ఎన్‌ఎస్‌డీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా కానీ చెల్లించొచ్చు.

ఇదీ చదవండి: పాన్‌- ఆధార్‌ లింక్‌ చేయండిలా..

పాన్‌-ఆధార్‌ లింక్‌ లేకపోతే ఏమవుతుంది?

బ్యాంకింగ్‌ సేవలను పొందడం, డెబిట్‌, క్రెడిట్‌ కార్డులను వాడడం, ఆన్‌లైన్‌ చెల్లింపులు, యూపీఐ, మొబైల్‌ బ్యాంకింగ్‌ ఇలాంటి సేవలన్నీ ఎలాంటి అవాంతరం లేకుండా పొందాలంటే.. మీ పాన్‌ను ఆధార్‌ను తప్పనిసరిగా అనుసంధానం (PAN Aadhaar Link) చేయాలి. లేదంటే ఈ సేవలకు విఘాతం కలిగే ఆస్కారం ఉంది. 

  • మీకు బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి వచ్చే వడ్డీ, డివిడెండు, ఇతర ఆదాయాలపైనా అధిక మొత్తంలో పన్ను కోత విధించే అవకాశం ఉంది. ఒకసారి ఇలా విధించిన పన్నును తిరిగి వెనక్కి తీసుకునే అవకాశమూ ఉండదు. 
  • పనిచేయని పాన్‌తో ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసేందుకు వీలుండదు.
  • పెండింగ్‌ రిటర్నుల ప్రాసెస్‌ కూడా నిలిచిపోతుంది.
  • పెండింగ్‌ రీఫండ్‌లను జారీ చేయరు.

ఎవరికి లింక్ అవసరం లేదంటే..?

అయితే కొన్ని కేటగిరీకు సంబంధించిన వ్యక్తులకు పాన్‌తో ఆధార్‌ను లింక్‌ చేయడం తప్పనిసరి కాదని సీబీడీటీ (CBDT) తెలిపింది. 80 ఏళ్ల పైబడిన వ్యక్తులు, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భారత నివాసి కాని వారు (ఎన్నారైలు).. భారత పౌరులు కాని వ్యక్తులు, అస్సాం, మేఘాలయ, జమ్ము, కశ్మీర్‌లల్లో నివాసం ఉండే వారు దీన్ని లింక్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని