LIC: మొదటి సారి లిస్టింగ్‌ ధర దాటిన ఎల్‌ఐసీ

LIC share: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ మొదటిసారి లిస్టింగ్‌ ధరను దాటింది. ఇష్యూ ధరకు మాత్రం ఇంకాస్త దూరంలో నిలిచింది.

Published : 16 Jan 2024 20:31 IST

LIC | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) మొదటిసారి లిస్టింగ్‌ ధర రూ.872.25ను దాటింది. 52 వారాల గరిష్ఠాలకు చేరుకుంది. మంగళవారం ఇంట్రాడేలో కంపెనీ షేరు 5.30 శాతం పెరిగి రూ.900 మార్క్‌ను తాకింది. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈలో ఎల్‌ఐసీ షేరు 4.42 శాతం లాభంతో రూ.892.50 వద్ద ముగిసింది.

2022 మే 17న ఎల్‌ఐసీ లిస్టింగ్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఇష్యూ ధర రూ.949గా కంపెనీ నిర్ణయించింది. కానీ 8.11 శాతం నష్టంతో రూ.872 వద్ద లిస్టయ్యింది. అప్పటి నుంచి స్టాక్‌ పడుతూనే వచ్చింది. 2023 మార్చిలో కనిష్ఠంగా రూ.530కి పడిపోయింది. ఆ తర్వాత కాస్త పుంజుకున్నప్పటికీ ఇష్యూ ధర కంటే తక్కువగానే ట్రేడవుతూ వచ్చింది. గతేడాది నవంబర్‌లో మాత్రం ఎల్‌ఐసీ షేరు విలువ 12.83 శాతం పెరిగింది. అప్పటి నుంచి లాభాల ట్రెండ్‌ కొనసాగుతోంది. డిసెంబరులో ఏకంగా 22.52 శాతం పెరిగితే.. జనవరిలో ఇప్పటివరకు షేరు విలువ 7.51 శాతం పుంజుకుంది. నవంబరు నుంచి ఇప్పటి వరకు కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.84 లక్షల కోట్లు పెరిగి రూ.5.64 లక్షల కోట్లకు చేరుకుంది.

ఎల్‌ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం

గతేడాది నవంబరులో జీవన్‌ ఉత్సవ్‌ (LIC Jeevan Utsav) పేరుతో ఎల్‌ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం వచ్చేలా దీన్ని రూపొందించింది. ఈ పాలసీ ప్రకటన సమయంలోనే కంపెనీ షేరు అమాంతం పెరిగింది. ఐపీఓ ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఎల్‌ఐసీ ఇంకా 6.21 శాతం దూరంలోనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని