Microsoft: మైక్రోసాఫ్ట్‌ బింగ్‌లోనూ చాట్‌జీపీటీ తరహా ఫీచర్‌?

మైక్రోసాఫ్ట్‌ సైతం గూగుల్‌కు పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. చాట్‌జీపీటీ తరహాలోనే బింగ్‌ను ఏఐను అనుసంధానించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 04 Jan 2023 14:09 IST

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు పోటీనిచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ (Microsoft) సైతం సిద్ధమవుతోంది. తమ సెర్చ్‌ ఇంజిన్‌ బింగ్‌ (Bing)ను కృత్రిమ మేధ (AI) ఆధారంగా పనిచేసేలా తీర్చిదిద్దుతున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న కంపెనీ వ్యక్తులు తెలిపారు. ఇప్పటికే ఓపెన్‌ఏఐ (OpenAI) అనే సంస్థ చాట్‌జీపీటీ (ChatGPT) పేరిట సెర్చ్‌ ఇంజిన్‌ తరహా సాంకేతికతను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే.

బింగ్‌లో ఈ కొత్త ఫీచర్‌ను మార్చి చివరి కల్లా విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ విషయంపై ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలో తాము ఓపెన్‌ఏఐ నుంచి తీసుకున్న ఇమేజ్‌ జనరేషన్‌ సాఫ్ట్‌వేర్‌ DALL-E 2ను బింగ్‌తో అనసంధానించనున్నట్లు గత ఏడాది మైక్రోసాఫ్ట్‌ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది.

శాన్‌ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఓపెన్‌ఏఐలో 2019లో మైక్రోసాఫ్ట్‌ 1 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. ఈ రెండూ కలిసి అజూర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీస్‌లో కృత్రిమ మేధ ఆధారిత సూపర్‌కంప్యూటింగ్‌ టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేస్తున్నాయి. గత నవంబరు 30న ఓపెన్‌ఏఐ చాట్‌జీపీటీని ప్రయోగాత్మకంగా విడుదల చేసింది. మనుషుల మాదిరిగా రాతరూపంలో ఆవిష్కరించటమేగాకుండా, అనువాదాల్లో కూడా చాట్‌జీపీటీ ఎంతో కచ్చితంగా ఉంటుంది. గూగుల్‌ సెర్చి మాదిరిగా ప్రశ్నలకు సమాధానాలను లిస్ట్‌ చేయటంతో ఆగకుండా... సులభంగా అర్థమయ్యేలా సమాధానాలను రాతరూపంలో రాస్తుంది. అంతేగాకుండా ఏవైనా అంశంపై కొత్త వ్యాసం కావాలన్నా, పరిశోధన పత్రాలు కావాలన్నా రాసిస్తుంది. అంతెందుకు టాపిక్‌ చెబితే కొత్త కవిత, లేఖలు కూడా తక్షణమే రాసిస్తుంది. మనుషులు మాట్లాడే వివిధ భాషలను అర్థం చేసుకొని సమాధానం ఇవ్వగలుగుతుంది.

ఇదీ చదవండి: ఏంటీ చాట్‌జీపీటీ? గూగుల్‌కు ఎందుకు అంత గుబులు?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని