IPO: ఈ రోజే మూడు ఐపీఓలు.. రూ.1,511 కోట్ల సమీకరణే లక్ష్యం

IPO: మోతీసన్స్‌ జువెలర్స్‌, ముత్తూట్‌ మైక్రోఫిన్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓలు సోమవారం ప్రారంభమయ్యాయి. 20వ తేదీ వరకు ఈ కంపెనీల షేర్ల కోసం బిడ్లు దాఖలు చేయొచ్చు.

Updated : 18 Dec 2023 11:29 IST

IPO | దిల్లీ: ఈ రోజు మూడు కంపెనీల ఐపీఓలు (IPO) ప్రారంభమయ్యాయి. రిటైల్‌ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌, ముత్తూట్‌ మైక్రోఫిన్‌, సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు కలిపి మొత్తం రూ.1,511 కోట్లు సమీకరించేందుకు సిద్ధమయ్యాయి.

ముత్తూట్‌ మైక్రోఫిన్‌

ఈ రోజు ఐపీఓకి (IPO) వచ్చిన కంపెనీల్లో ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌నకు చెందిన ముత్తూట్‌ మైక్రోఫిన్‌ (Muthoot Microfin IPO) ఒకటి. దీని షేరు ధరల శ్రేణిని రూ.277-291గా కంపెనీ నిర్ణయించింది. డిసెంబర్‌ 20న సబ్‌స్క్రిప్షన్‌ ముగుస్తుంది. మొత్తం రూ.960 కోట్లను ఐపీఓ ద్వారా సమీకరించాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో రూ.760 కోట్లను కొత్త షేర్ల విక్రయం ద్వారా.. మిగిలిన రూ.200 కోట్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ విధానంలో విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది.

ఐపీఓలో (Muthoot Microfin IPO) విక్రయిస్తున్న షేర్లలో క్యూఐబీలకు 55 శాతం, రిటైల్‌ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్‌ఐఐలకు 15 శాతం చొప్పున కేటాయించారు. రిటైల్‌ మదుపరులు కనీసం 51 షేర్లకు (లాట్‌) బిడ్లు దాఖలు చేయాలి. అంటే కనీసం రూ.14,841 పెట్టుబడి పెట్టాలి. ముత్తూట్‌ పప్పాచాన్‌ గ్రూప్‌ బంగారం తాకట్టు రుణాలతో పాటు తమ అనుబంధ సంస్థల ద్వారా సాధారణ, రియల్‌ ఎస్టేట్‌, ఎడ్యుకేషన్‌ లోన్స్‌ను అందిస్తుంటుంది. ఈ గ్రూప్‌ నుంచి వస్తున్న రెండో ఐపీఓ ఇది. గతంలో ద్విచక్ర వాహన రుణాలు అందించే ముత్తూట్‌ క్యాపిటల్‌ సంస్థ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. ముత్తూట్‌ మైక్రోఫిన్‌ సంస్థకు 32 లక్షల మంది కస్టమర్లు ఉన్నారు. తిరువనంతపురానికి చెందిన ఈ కంపెనీకి 18 రాష్ట్రాల్లో 1,340 శాఖలు ఉన్నాయి. 12,290 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

Credit Card: పరిమితంగా వాడితేనే..


సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌

సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఐపీఓ (Suraj Estate Developers IPO) సైతం ఈరోజే ప్రారంభమైంది. 20వ తేదీ వరకు కొనసాగుతుంది. మొత్తం రూ.400 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. దీని షేరు ధరల శ్రేణిని రూ.340-360గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో పూర్తిగా కొత్త షేర్లను మాత్రమే జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి విక్రయాలు లేవు.

ఈ ఐపీఓ (Suraj Estate Developers IPO) ద్వారా వచ్చిన నిధులను సూరజ్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ తమ రుణ చెల్లింపులతో పాటు సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఈ సంస్థ దక్షిణ మధ్య ముంబయి ప్రాంతంలో పలు గృహ, వాణిజ్య స్థిరాస్తి ప్రాజెక్టులను చేపట్టింది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన రూ.273 కోట్ల నుంచి రూ.306 కోట్లకు పెరిగింది. అదే సమయంలో లాభం రూ.26.50 కోట్ల నుంచి రూ.32 కోట్లకు ఎగబాకింది.

ఈ ఐపీఓలో (Suraj Estate Developers IPO) ఇన్వెస్టర్లు కనీసం 41 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన గరిష్ఠ ధర వద్ద కనీసం రూ.14,760 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఐటీఐ క్యాపిటల్‌, ఆనంద్‌ రాఠీ అడ్వైజర్స్‌ ఈ ఐపీఓకి బుక్‌ రన్నింగ్ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్లు నమోదు కానున్నాయి.


మోతీసన్స్‌ జువెలర్స్‌

జయపురకు చెందిన రిటైల్‌ ఆభరణాల కంపెనీ మోతీసన్స్‌ జువెలర్స్‌ ఐపీఓ (IPO) నేడు ప్రారంభమై 20వ తేదీన ముగియనుంది. ఐపీఓ (Motisons Jewellers IPO)లో షేరు ధరల శ్రేణిని రూ.52-55గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)లో మొత్తం 2.74 కోట్ల ఈక్విటీ షేర్లను కొత్తగా జారీ చేస్తున్నారు. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ఎలాంటి షేర్లను విక్రయించడం లేదు. గరిష్ఠ ధర వద్ద కంపెనీ రూ.151 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఐపీఓ ద్వారా సమకూరిన నిధులను మోతీసన్స్‌ జువెలర్స్‌ రుణ చెల్లింపులు, నిర్వహణ మూలధనం, సాధారణ కార్పొరేట్‌ అవసరాల కోసం వినియోగించనుంది. ఇన్వెస్టర్లు కనీసం 250 ఈక్విటీ షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన కనీసం రూ.13,750 పెట్టుబడి అవసరం. ప్రీ-ఐపీఓ ఫండింగ్‌ రౌండ్‌లో ఈ కంపెనీ ఇప్పటికే రూ.33 కోట్లు సమీకరించింది. హొలానీ కన్సల్టెంట్స్‌ ఈ ఐపీఓ (Motisons Jewellers IPO)కి బుక్‌ రన్నింగ్‌ లీడ్ మేనేజర్‌గా వ్యవహరిస్తోంది. కంపెనీ షేర్లు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలో నమోదు కానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని