Stock Market: మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు.. 17,180 దిగువన నిఫ్టీ

Stock Market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి...

Published : 26 Sep 2022 09:36 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈవారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు అమెరికా సహా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లు పెంచుతుండడం మార్కెట్లపై ప్రభావం చూపుతోంది. ఈనెల 28-30 తేదీల్లో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) జరపనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలపై మదుపర్లు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ద్రవ్యోల్బణంతో పాటు ఇతర అంశాలపై ఆర్‌బీఐ గవర్నర్‌ చేయబోయే వ్యాఖ్యలు, విదేశీ పెట్టుబడుల తీరు మార్కెట్‌కు దిశానిర్దేశం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వడ్డీరేట్లపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ మంగళవారం తీసుకునే నిర్ణయమూ ప్రభావం చూపొచ్చు. రూపాయి పతనం సూచీలను మరింత కలవరపెడుతోంది. 

ఈ పరిణామాల మధ్య ఉదయం 9:25 గంటల సమయానికి సెన్సెక్స్‌ 552 పాయింట్లు నష్టపోయి 57,546 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 17,154 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ మరింత పతనమై రూ.81.49 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ, టాటా స్టీల్‌, టైటన్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, విప్రో, రిలయన్స్‌, టీసీఎస్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

నేడు గమనించాల్సిన స్టాక్స్‌...

సుజ్లాన్‌ ఎనర్జీ: రైట్స్‌ ఇష్యూలో 240 కోట్ల షేర్లను జారీ చేయడం ద్వారా రూ.1200 కోట్లు సమీకరించేందుకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సుజ్లాన్‌ ఎనర్జీ వెల్లడించింది.

కోల్‌ ఇండియా: బొగ్గు నుంచి రసాయనాల ఉత్పత్తుల వరకు మొత్తం మూడు ప్రభుత్వ రంగ సంస్థలతో బొగ్గుశాఖ అవగాహనా ఒప్పందం కుదుర్చుకొందది. 2030 నాటికి 100 ఎంటీ కోల్‌ గ్యాసిఫికేషన్‌ లక్ష్యంగా నాలుగు ఉపరితల కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టులను కోల్‌ ఇండియా ఏర్పాటు చేయనుంది.

ఎస్‌బీఐ: ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ఆధారంగా నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లను జారీ చేయడం ద్వారా ఎస్‌బీఐ రూ.4,000 కోట్లు సమీకరించింది.

హర్ష ఇంజినీర్స్‌ ఇంటర్నేషనల్‌: ఈ కంపెనీ ఈరోజు తొలిసారి స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానుంది. ఐపీఓలో ఒక్కో షేరు ధరను రూ.330గా నిర్ణయించారు.

పీఐ ఇండస్ట్రీస్‌: ప్రమోటర్‌ మయాంక్‌ సింఘాల్‌ ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా కంపెనీలోని 0.6 శాతం వాటాలకు సమానమైన 10 లక్షల షేర్లను విక్రయించారు. ఒక్కో షేరును రూ.3,150 సగటు ధర వద్ద అమ్మారు.

బ్రిటానియా ఇండస్ట్రీస్‌: వరుణ్‌ బెర్రీని ఎగ్జిక్యూటివ్‌ వైస్‌-ఛైర్మన్‌, ఎండీగా ప్రమోట్‌ చేశారు. రజనీత్‌ కోహ్లీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, సీఈఓగా నియమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని