Budget 2024: బడ్జెట్‌లో 12 కీలక ప్రకటనలు.. సీతారామన్‌ మాటల్లో..

Budget: బడ్జెట్‌లోని 12 కీలక ప్రకటనలను సీతారామన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు.

Updated : 01 Feb 2024 18:42 IST

దిల్లీ: అభివృద్ధిపై తమ ప్రభుత్వ విధానానికి తాజా బడ్జెట్‌ (Union Budget 2024) ప్రతీక అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) చెప్పారు. ద్రవ్య లోటును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నామని తెలిపారు. ఈ సారి 4.5 శాతానికి కుదించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. బడ్జెట్‌ అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 

తమ ప్రభుత్వం GDP (గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌, పెర్ఫార్మెన్స్‌) ఆధారంగా ముందుకెళ్తోందని సీతారామన్‌ తెలిపారు. సరైన విధానాలు, నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. సమర్థమైన పాలన (Governance) వల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడం, ఆదాయం పుంజుకోవడం, ప్రజలు తమ భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగడం అభివృద్ధిని (Development) సూచిస్తోందన్నారు. మూడేళ్లుగా ఏడు శాతం వృద్ధి రేటుతో జీ20 దేశాల్లో భారత్‌ వేగవంతమైన వృద్ధి నమోదు చేయడం ఈ ప్రభుత్వ మెరుగైన పనితీరుకు (Performance) నిదర్శనమన్నారు.

వికసిత్‌ భారత్‌ వైపు పయనించేందుకు ‘దిశ - నిర్దేశం’ కింద ఐదు లక్ష్యాలను పెట్టుకున్నట్లు సీతారామన్‌ వెల్లడించారు. అందులో సామాజిక న్యాయం ఒకటన్నారు. ఇది కేవలం తమకు నినాదం మాత్రమే కాదని దీన్ని ఒక పాలనా విధానంగా అమలు చేస్తున్నామన్నారు. పేదలు, మహిళలు, అన్నదాతలు, యువకులపై ప్రధానంగా దృష్టి సారిస్తూ తమ పాలన కొనసాగించడం రెండో లక్ష్యమని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేయటం మూడోది కాగా ఈ ఏడాది మూలధన వ్యయాన్ని 11 శాతం పెంచామన్నారు. సాంకేతికతతో అవకాశాలను సృష్టించుకోవడం నాలుగో లక్ష్యమని వివరించారు. జనాభా వృద్ధి, సంబంధిత సవాళ్లను ఎదుర్కోవటం కోసం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు ‘దిశ - నిర్దేశం’ కింద చివరి లక్ష్యమని వెల్లడించారు.

బడ్జెట్‌లోని 12 కీలక ప్రకటనలను సీతారామన్‌ ఈ సందర్భంగా వెల్లడించారు. అవేంటంటే...

  • పీఎం ఆవాస్‌ యోజన కింద మరో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం 
  • మధ్య తరగతి కోసం గృహ వసతి
  • నెలకు 300 యూనిట్ల (కనీసం) విద్యుదుత్పత్తి కోసం సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్ల మంజూరు
  • ‘లక్‌పతీ దీదీ’ లక్ష్యాన్ని రెండు కోట్ల మహిళల నుంచి మూడు కోట్లకు పెంపు
  • అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు దన్ను
  • వికసిత్‌ భారత్‌ లక్ష్యంలో తూర్పు రాష్ట్రాల (బిహార్‌, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌) పాత్రను కీలకం చేయడం
  • రాష్ట్రాలతో సంప్రదించి తర్వాత తరం సంస్కరణలను చేపట్టడం
  • మూడు రైల్వే కారిడార్ల ఏర్పాటు
  • పట్టణీకరణ
  • ప్రైవేట్‌ రంగం ద్వారా పరిశోధన, ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్ల నిధి 
  • పర్యటక రంగ అభివృద్ధి
  • రాష్ట్రాల్లో సంస్కరణలకు దన్ను
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని