fuel price cut: చమురు ధరల తగ్గింపుపై కేంద్రం క్లారిటీ

Hardeep Singh Puri on fuel price cut: చమురు ధరల తగ్గిస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ స్పష్టతనిచ్చారు.

Updated : 03 Jan 2024 15:47 IST

Price cut | దిల్లీ: సార్వత్రిక ఎన్నికల ముందు చమురు ధరలను కేంద్రం తగ్గిస్తుందంటూ వస్తున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. చమురు ధరల తగ్గింపుపై జరుగుతున్న ప్రచారం అనేది పూర్తిగా ఊహాజనితమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురీ పేర్కొన్నారు. చమురు ధరల తగ్గింపుపై ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో ఎలాంటి చర్చలూ జరగలేదని బుధవారం విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చారు.

ఓ వైపు అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తుందంటూ వార్తలు వచ్చాయి. లీటర్‌కు రూ.6 మేర తగ్గే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఒకప్పటితో పోలిస్తే చమురు ధరలు గరిష్ఠాల నుంచి భారీగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆ మేర వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే, అలాంటిదేమీ లేదంటూ ప్రచారానికి పురీ చెక్‌ పెట్టారు.

Credit Card: యాడ్‌-ఆన్‌ క్రెడిట్‌ కార్డులతో ప్రయోజనమెంత?

అంతర్జాతీయంగా చమురు ధరలు ఒడుదొడుకుల కారణంగా అటు అభివృద్ధి చెందిన, పొరుగు దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అమాంతం పెరిగాయని అన్నారు. భారత్‌లో మాత్రం ధరలు స్థిరంగా ఉన్నాయని గుర్తు చేశారు. దక్షిణాసియా దేశాల్లో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు 40-80 శాతం మేర పెరిగాయని, పశ్చిమ దేశాల్లోనూ ధరలు పెరిగాయని చెప్పారు. అదే సమయంలో భారత్‌లో 2021 నవంబర్‌, 2022 మే నెలలో రెండు సార్లు చమురు ధరలు తగ్గాయని మంత్రి గుర్తుచేశారు.

భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, ఎల్పీజీ దిగుమతిదారుగా ఉందని పురీ చెప్పారు. ఎల్‌ఎన్‌జీ దిగుమతి, రిఫైనరీ, ఆటోమొబైల్‌ మార్కెట్‌ పరంగా నాలుగో స్థానంలో ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌లో ఎప్పడికప్పుడు చమురు ధరలు తీవ్రమైన ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ఉంటాయని చెప్పారు. అలాంటి స్థితిలో ఏ ప్రభుత్వానికి అయినా చమురు ధరలు తగ్గించడం కష్టంతో కూడుకున్న వ్యవహారమన్నారు. ఈ క్రమంలోనే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలతో చమురు ధరల తగ్గింపుపై ఎలాంటి సంప్రదింపులూ జరగలేదని చెప్పారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు లాభాలు ప్రకటించినప్పటికీ.. చమురు ధరలు గరిష్ఠంగా ఉన్న సమయంలో రిఫైనరీలు భారీ నష్టాలు చవిచూశాయన్న అంశాన్ని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని