Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు..!

Railway ticket booking: రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం రైల్వే శాఖ కల్పిస్తోంది. 

Published : 08 Aug 2022 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైలు ప్రయాణానికి (Train ticket) టికెట్‌ బుక్‌ చేయడం ప్రయాసతో కూడుకున్న వ్యవహారం. దూర ప్రయాణాలు చేయాలంటే కొన్ని రోజుల ముందు టికెట్‌ బుక్‌ చేసుకోవాల్సిందే. అదే రద్దీ రూట్లలో అయితే ఇంకా ముందుగానే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి రెండు రోజుల ముందు ప్రయాణాలు నిర్ణయమైతే తత్కాలే బుకింగే దిక్కు. ఒకవేళ అందులోనూ టికెట్‌ దొరక్కపోతే ఇక ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే. అయితే, రైలు టికెట్‌ దొరకలేదని నిరుత్సాహ పడనవసరం లేదు. టికెట్లు ఖాళీ ఉంటే రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు కూడా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. కౌంటర్‌ వద్ద గానీ, ఆన్‌లైన్‌లోగానీ టికెట్‌ పొందొచ్చు. చాలా రోజుల నుంచీ రైల్వే శాఖ ఈ సదుపాయం ఉన్నప్పటికీ చాలా మంది వినియోగించుకోవడం లేదు. కాబట్టి దీని గురించి తెలుసుకుందాం.

రైలు బుక్‌ చేసుకోవడానికి రైల్వే శాఖ రెండు ఛార్ట్‌లను ప్రిపేర్‌ చేస్తుంది. ఫస్ట్‌ ఛార్ట్‌ అనేది రైలు బయల్దేరడానికి 4 గంటల ముందు ప్రిపేర్‌ అవుతుంది. రెండో ఛార్ట్‌ అనేది ప్రయాణానికి సరిగ్గా అరగంట ముందు రూపొందిస్తారు. గతంలో ప్రయాణానికి అరగంట ముందు వరకు మాత్రమే టికెట్‌ బుకింగ్‌ అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి 5 నిమిషాల ముందు వరకు టికెట్‌ బుక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి రైలు ప్రయాణం చేయాలనుకునేవారు ట్రైన్‌ బయల్దేరడానికి ముందు కూడా టికెట్ల కోసం చూడడం మంచిది. అప్పటికీ దొరక్కపోతే ప్రత్యామ్నాయాలను చూసుకోవచ్చు.

సులువుగా తెలుసుకోండిలా..

మీరు ప్రయాణించాలనుకున్న రైల్లో ఎవరైనా చివరి నిమిషంలో టికెట్‌ రద్దు చేసుకుంటే మీరు ఆ టికెట్లను పొందొచ్చు. అందుకోసం మీరు ఆన్‌లైన్‌ ఛార్ట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://www.irctc.co.in/online-charts/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి రైలు నంబర్‌, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్‌ వివరాలు ఇస్తే.. మీకు అక్కడ ఒక్కో భోగీలో ఎన్ని బెర్తులు ఖాళీ ఉన్నాయో తెలుసుకోచ్చు. ఒకవేళ టికెట్లు ఉంటే.. అక్కడే బుకింగ్‌కు ఆప్షన్‌ ఉంటుంది. దీంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.

  • ఆన్‌లైన్‌ ఛార్ట్‌ వల్ల ఇంకో ప్రయోజనం కూడా ఉందండోయ్‌.! ఒకప్పుడు ఛార్ట్‌ను రైళ్లకు అతికించేవారు. కొవిడ్‌ కారణంగా పూర్తిగా ఛార్టులను అతికించడం మానేశారు. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎదురుగా ఉన్న విండో సీట్‌ ఖాళీగా ఉంటుంది. కూర్చోవాలనిపించినా.. ఆ సీటు బుక్‌ చేసుకున్న వ్యక్తి వచ్చి ఎక్కడ తన సీటు ఖాళీ చేయమంటారో అని కొందరు సంశయిస్తుంటారు. అయితే ఆన్‌లైన్‌ ఛార్ట్‌లో ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఖాళీగా ఉన్న సీటు నంబర్‌ ఉన్న వ్యక్తి ఏ స్టేషన్‌లో ఎక్కుతాడు? ఏ స్టేషన్‌లో దిగుతాడు? అనే వివరాలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఛార్ట్‌లో పేర్లు, వయసు సహా వివరాలు కనిపించేవి. ఆన్‌లైన్‌లో కేవలం స్టేషన్‌ వివరాలు మాత్రమే కనిపిస్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని